ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటుసారా కలకలం సృష్టించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సిరిమామిడిలో నాటుసారా తాగిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి నాటుసారా తాగిన 25 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వాళ్లందరిని హరిపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రక్తపు వాంతులు అవడంతో మెరుగైన వైద్యం కోసం వాళ్లిద్దరినీ శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించారు.
మిగతా 23 మంది స్థానిక వైద్యుడి వద్ద చికిత్స పొంది ఇళ్లకు చేరుకున్నారు. ఒడిశా నుంచి తీసుకొచ్చిన నాటుసారా తాగడం వల్లే వీళ్లు అస్వస్థతకు గురయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.