విశాఖ: ప్రియుడితో వచ్చి రాళ్లలో ఇరుక్కున్న యువతి.. చివరకు
ప్రియుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన యువతి అనుకోకుండా పైనుంచి పడి రాళ్ల మధ్యలో ఇరుక్కుంది.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 1:48 PM ISTవిశాఖ: ప్రియుడితో వచ్చి రాళ్లలో ఇరుక్కున్న యువతి.. చివరకు
ప్రియుడితో కలిసి ఓ యువతి బీచ్‌కు వెళ్లింది. విశాఖలోనే ప్రియుడితో కలిసి వారం రోజులుగా ఉంది. అయితే.. అనుకోకుండా అప్పికొండ బీచ్‌వద్ద యువతి పైనుంచి పడి రాళ్ల మధ్యలో ఇరుక్కుంది. ఆ తర్వాత అంబులెన్స్ కోసం వెళ్లిన ప్రియుడు తిరిగి రాలేదు. దాంతో.. యువతి నరకయాతన అనుభవించింది.
విశాఖపట్నంలోని అప్పికొండ బీచ్‌లో ఈ సంఘటన జరిగింది. రాళ్ల మధ్యన ఇరుక్కున్న యువతికి సంబంధించిన వార్త చర్చనీయాంశంగా మారింది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన యుతి.. వర్మ రాజుతో కలిసి ఈ నెల 2న అప్పికొండ శివాలయ పరిసరాల్లోకి వచ్చింది. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆదివారం సాయంత్రం తీరం దగ్గర ఉన్న రాళ్ల గుట్టలపైకి ఇద్దరూ ఎక్కారు. ఫొటోలు తీసుకుంటున్న క్రమంలో యువతి ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. ఎత్తైన ప్రదేశం నుంచి కిందపడిపోవడంతో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దాంతో.. ఆమెతో పాటు ఉన్న యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాసేపటికి యువతి కళ్లు తెరిచి చూసే సరికి చీకటి కావొస్తుంది.
హెల్ప్ చేయాలంటూ ఎంత అరిచినా ఎవరూ రాలేదు. రాత్రివేళ కావడంతో అక్కడ ఎవరూ లేరు. ఆ తర్వాత సోమవారం ఉదయం బీచ్‌కు వెళ్లిన కొందరు జాలర్లు రాళ్ల మధ్యన ఇరికిన యువతిని చూసి షాక్ అయ్యారు. దాంతో.. వారు యువతిని నెమ్మదిగా బయటకు లాగారు. యువతి రెండు కాళ్లకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జాలర్లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సదురు యువతిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ సందర్భంగా సదురు యువతి పోలీసులతో ఇలా చెప్పింది.. వర్మ రాజు అనే వ్యక్తితో తాను వచ్చానని.. అతన్ని ఏమీ అనొద్దని కోరినట్లు సమాచారం. ఇక పరారీలో ఉన్న యువకుడికి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరోవైపు యువతి తల్లి తన కూతురు కనబడటం లేదని మచిలీపట్నం పోలీసులకు అప్పటికే ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అయితే.. విశాఖ పోలీసులు యువతి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమె తల్లికి తెలియజెప్పారు. దాంతో.. యువతి కోసం తల్లి విశాఖకు చేరుకుంది. ఇక ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.