లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి : ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ క‌మిష‌న‌ర్‌

Cyclone Jawad alert in Northern Andhra Districts.ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం బ‌ల‌ప‌డి వాయుగుండంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Dec 2021 9:24 AM IST
లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి : ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ క‌మిష‌న‌ర్‌

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం బ‌ల‌ప‌డి వాయుగుండంగా మారింది. ప్ర‌స్తుతం ఇది విశాఖ ప‌ట్నానికి 960 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 850 కి.మీ దూరంలో కేంద్రీకృత‌మై ఉంది. ప‌శ్చిమ వాయువ్య దిశ‌గా ప‌య‌నించి మ‌రో 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఈ తుఫాన్‌కు జొవాద్ అని నామ‌క‌ర‌ణం చేశారు. ప్ర‌స్తుతం గంట‌కు 32 కి.మీ వేగంతో వాయుగుండం ముందుకు క‌దులుతోందని.. శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర - ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబు తెలిపారు.

దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. శనివారం ఉత్తరాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయ‌ని చెప్పారు. నేటి అర్థ‌రాత్రి నుంచి తీరం వెంబ‌డి గంట‌కు 45 నుంచి 65 కి.మీ వేగంతో భారీ ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని, రేపు(శ‌నివారం) ఉద‌యం 70 నుంచి 90 కి.మీ వేగంతో బ‌ల‌మైన గాలులు వీస్తాయ‌ని ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా ఉంద‌ని.. మ‌త్స్య‌కారులు చేప‌ల వేట‌కు వెళ్ల‌రాద‌ని సూచించారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో కాలువలు, నీటి ప్ర‌వాహాలు ప్ర‌వ‌హించే మార్గాల్లోని ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు.

తుఫాన్ కారణంగా డిసెంబ‌ర్ 3 నుంచి 5వ తేదీ వ‌ర‌కు మొత్తం మూడు రోజులు విశాఖ‌లోని ప‌ర్యాట‌క ప్ర‌దేశాల్లో సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తి లేద‌ని విశాఖ క‌లెక్ట‌ర్ మ‌ల్లికార్జున ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు జీవీఎంసీ, పోలీస్‌, రెవెన్యూ, ఇరిగేష‌న్ సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

Next Story