అసని తుఫాన్ ఎఫెక్ట్.. విశాఖకు విమాన రాకపోకలు రద్దు
Cyclone Asani impact Several flights cancelled due to bad weather.అసని తుఫాను కారణంగా దేశ వ్యాప్తంగా పలు విమాన
By తోట వంశీ కుమార్ Published on 10 May 2022 9:51 AM ISTఅసని తుఫాను కారణంగా దేశ వ్యాప్తంగా పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా విశాఖపట్నం నుంచి అన్ని ఇండిగో విమానాలను రద్దు చేశారు. మొత్తం 23 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎయిన్ ఏషియాకు చెందిన ఢిల్లీ-విశాఖ, బెంగళూరు -విశాఖ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఎయిర్ ఇండియాకు చెందిన ముంబయి-రాయపూర్-విశాఖ, ఢిల్లీ-విశాఖ విమానాలు కూడా రద్దు అయ్యాయి. అసని తుఫాను నేపథ్యంలో తీవ్ర గాలుల వల్ల ముందు జాగ్రత్త చర్యగా తమ సర్వీసులను రద్దు చేసినట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే.. అసని తుపాను దూసుకొస్తోంది. అసని తుఫాన్ ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. సముద్ర తీర ప్రాంతంలో కెరటాలు ఎగిసి పడుతున్నాయి. కాకినాడ కోనసీమ జిల్లాల తీర ప్రాంతం వెంబడి సుమారు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. గడిచిన ఆరు గంటల్లో తుఫాను గంటకు 7కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం కాకినాడకు 330కి.మీ, విశాఖపట్నానికి 350కి.మీ, గోపాలపూర్‌కు 510 కి.మీ, పూరీకి 590 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ రోజు రాత్రికి ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చి అనంతరం దిశ మార్చుకుని ఉత్తరాంధ్ర-ఒడిశా వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో ఈ రోజు కోస్తాంధ్రలో, రేపు ఉత్తరాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.