బుధవారం సీఎం జగన్ విశాఖ పట్నంలో పర్యటిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి పెందుర్తి మండలం చినముషిడివాడలో శ్రీ శారదా పీఠానికి చేరుకొని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆధ్వర్యంలో వార్షిక మహోత్సవాల్లో పాల్గొన్నారు. విశాఖ చేరుకున్న తర్వాత అందరి చూపు సీఎం జగన్ పైనే ఉంది. ఆయన నోటి నుంచి ఏం పలుకులు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు.
కాగా, ఉక్కు పరిరక్షణ సమితి ప్రతినిధులతో భేటీ అయ్యారు. కార్మికులు వేచి ఉన్న భవనం వద్దకు వెళ్లి మాట్లాడారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని.. ఉక్కు పరిరక్షణ సమితి ప్రతినిధులు సీఎంను కోరారు. ఎన్‌ఎండీసీని విశాఖ ఉక్కుతో అనుసంధానించాలని విజ్ఞప్తి చేశారు. అనుసంధానం వల్ల సొంత గనుల సమస్య తీరుతుందని వివరించారు.
అనుసంధానానికి కేంద్రాన్ని ఒప్పించాలని అన్నారు. కార్మిక సంఘాల నేతలతో భేటీలో మంత్రులు కృష్ణదాస్, అవంతితో పాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలు విద్యార్థి సంఘాలు నాయకులు 150 బైక్‌లతో అమరావతి నుంచి విశాఖ వరకూ ర్యాలీగా చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్.. మేన్ గేట్ వరకు చేరుకుని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ కారు చౌకగా విక్రయించాలని చూడడం అన్యాయమన్నారు.