మొబైల్ ఫోన్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి!?
By Newsmeter.Network Published on 16 May 2020 9:18 AM ISTకరోనా వైరస్ భారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రపంచ దేశాలు ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు కీలక సూచనలు చేసింది. ప్రభుత్వాలుసైతం వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్లు వాడాలని ఇలా పలు విధాల జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. తాజాగా మొబైల్ ఫోన్ల ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read :బ్రేకింగ్: నిర్మల్ జిల్లాలో వలస కూలీల లారీ బోల్తా.. 49 మంది..
ముఖ్యంగా మొబైల్ ఫోన్లు ద్వారా వైద్య సిబ్బందికి వైరస్ వ్యాపించే ప్రమాదముందని, ఆసుపత్రుల్లో వాటి వినియోగాన్ని పూర్తిగా కట్టడి చేయాలని ఎయిమ్స్ - రాయ్‌పూర్ వైద్యులు సూచించారు. ఈ మేరకు డా. వినీత్‌కుమార్ పాఠక్ బృందం బీఎంజే గ్లోబల్ హెల్త్ పత్రికకు వ్యాసం అందించింది. ఈ వ్యాసంలో మొబైల్ ఫోన్లు వైరస్ వాహకాలేనని స్పష్టం చేశారు. ఎలా వైరస్ వాహకాలుగా మారుతున్నాయో వివరించారు. ఫోన్‌ల ఉపరితల భాగాలు అత్యంత ప్రమాదకరమని, వాటిపై ఉండే వైరస్ నేరుగా మొహానికి, నోటికి, కళ్లకు అంటుకునే ప్రమాదముందని చెబుతున్నారు. విధుల్లో భాగంగా వైద్య, ఆరోగ్య సిబ్బంది సగటున ప్రతి పదిహేను నిమిషాల నుంచి రెండు గంటలకు ఒకసారి మొబైల్ వాడుతుంటారని, వారు తమ చేతులను ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా మొబైల్‌ను ముట్టుకోవడం ద్వారా వైరస్ మళ్లిమళ్లి అంటుకునే ప్రమాదం ఉంటుందని పాఠక్ బృందం బీఎంజే గ్లోబల్ హెల్త్ పత్రికకు ఇచ్చిన వ్యాసంలో పేర్కొన్నారు.
Also Read :బిగ్గరగా మాట్లాడటం ద్వారానూ వైరస్ వేగంగా వ్యాప్తి..!
దీనిని పరిగణలోకి తీసుకొని ఫోన్‌ల వాడకాన్ని తగ్గించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ మొబైల్ వాడినా తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఆరోగ్య కేంద్రాలు, ఏసీయూలు, ఆపరేషన్ థియేటర్లలో ఫోన్లు వాడకంపై నిబంధనలు విధించాలన్నారు. ఫోన్లు వాడిన తర్వాత చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. మొబైల్, కంప్యూటర్ భాగాలను శుభ్రం చేసుకోవడానికి అనువైన పారదర్శక కవర్లతో కప్పి వాటిని వాడుకుంటే మేలు అని బృందం స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పలు విధాల జాగ్రత్తలు తీసుకుంటున్న వైద్యులు, ప్రజలు.. మొబైల్ వాడకంలోనూ జాగ్రత్తలు పాటించాల్సిందే మరి.