స్వీయ నిర్భంధంలో విరాట్‌కోహ్లీ, అనుష్కశర్మ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2020 3:43 PM IST
స్వీయ నిర్భంధంలో విరాట్‌కోహ్లీ, అనుష్కశర్మ

కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ఇప్పటికే 9వేల మందికి పైగా మృత్యువాత పడగా.. 2లక్షలకు పైగా దీని బాధితులు ఉన్నారు. ఇక భారత్‌లో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 206కు చేరుకుంది. కరోనా వైరస్‌ రోజు రోజుకు విభృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ను అరికట్టడానికి ఎవరికి వారు స్వీయ నిర్భంధంలో ఉండాలని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అతని సతీమణి బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్కశర్మ అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు కోహ్లీతో కలిసి అనుష్క ఓ వీడియో రూపొందించారు. ఆ వీడియోను అనుష్క ట్విట్టర్‌లో షేర్‌ చేయగా.. కోహ్లీ రీ ట్వీట్‌ చేశారు.

‘‘కరోనా వైరస్ రూపంలో మనం ఇప్పుడు చాలా విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాం. కాబట్టి.. ఆ వైరస్‌ని అరికట్టేందుకు ఉన్న ఏకైక మార్గం.. వ్యాప్తిని అడ్డుకోవడమే. అందుకే ఎవరి ఇళ్లలో వారు ఉద్దాం.. అది అందరికీ సురక్షితం. మేము ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ (స్వీయ నిర్బంధం)లో ఉన్నాం. మీరు కూడా మీ ఇళ్లలో ఉండండి’ అని విరుష్క జోడీ వీడియోలో సూచించింది.

ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్రమోదీ గురువారం సూచించిన జనతా కర్ఫ్యూ పై కూడా స్పందించాడు. ప్రధాని మోదీ చెప్పినట్లు అందరూ.. ఈ ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కరోనా ముప్పుతో దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌ని బీసీసీఐ ఇటీవల అర్థాంతరంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక మార్చి 29 నుంచి జరగాల్సిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-13వ సీజన్‌ ఏప్రిల్‌-15కు వాయిదా పడింది.



Next Story