వైరల్ పిచ్చి.. ఏకంగా రైలును పట్టాలు తప్పించిన యువకుడు (వీడియో)

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం యువత మునిగిపోయారు.

By Srikanth Gundamalla  Published on  26 July 2024 11:58 AM IST
young man,   train accident,  viral ,

వైరల్ పిచ్చి.. ఏకంగా రైలును పట్టాలు తప్పించిన యువకుడు (వీడియో)

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం యువత మునిగిపోయారు. ఏ చిన్న పని చేసినా షేర్ చేస్తున్నారు. కొంతమంది అయితే వైరల్ అవ్వడం కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ప్రమాదాల్లో పడ్డారు. తాజాగా ఓ యువకుడు వైరల్‌ వీడియో చేయాలనే ఉద్దేశంతో ఏకంగా రైలును పట్టాలు తప్పించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ యువకుడిని తీవ్రంగా తిట్టిపోస్తు కామెంట్స్ చేస్తున్నారు.

అమెరికాలోని నెబ్రస్కా రాష్ట్రంలోని లాంక్సటార్‌ కౌంటలోని ఓ 17 ఏళ్ల కుర్రాడు ఈ పని చేశాడు. యూట్యూబ్‌లో వీడియో వైరల్‌ చేయాలని కోరికతో పిచ్చి పని చేశాడు. ఏప్రిల్‌లో మోన్రోయ్‌ అనే ప్రాంతం వద్ద ఉన్న రైలు క్రాసింగ్ వద్దకు వెళ్లాడు ఓ యువకుడు. అక్కడ రైళ్ల మార్గాలను చూపించే స్విచ్‌ల లాక్‌ల గురించి ఎలా తెలుసుకున్నాడో ఏమో కానీ.. వాటిల్లో ఒకదానిని మార్పు చేశాడు. ఆ తర్వాత కెమెరాను ఆన్ చేసి అక్కడే వెయిట్‌ చేశాడు. ట్రెయిన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశాడు. అప్పుడే బీఎన్‌ఎస్‌ఎఫ్‌ సంస్థకు చెందిన రెండు లోకోమోటీవ్‌లు, ఐదు బోగీలు వచ్చాయి. ఆ లోకో పైలట్‌ గుర్తించే లోపే రైలు పట్టాలు తప్పింది. ప్రమాదం సంభవించింది.

ట్రైన్‌ ప్రమాదం జరిగిన తర్వాత భయంతో యువకుడు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చాడు. జరిగిందంతా వివరించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు దర్యాప్తు చేశారు. కీలక స్విచ్‌లను మార్చినట్లు గుర్తించారు. అనుమానంతో యువకుడిని నిలదీయడంతో చేసిన తప్పుని ఒప్పుకున్నాడు. వీడియో కోసమే తాను ఈ పనిచేసినట్లు చెప్పాడు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. అతనే స్విచ్‌లను మార్చినట్లు నిర్ధారించారు. అతనిపై కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. కాగా.. ఆ యువకుడి వైరల్‌ పిచ్చితో ఒహామా పబ్లిక్‌ పవర్‌ డిస్ట్రిక్ట్‌కు, బీఎన్‌ఎస్‌ఎఫ్‌ రైల్వేకు దాదాపు 3,50,000 డాలర్ల నష్టం వాటిల్లింది. మన కరెన్సీలో అది దాదాపు రూ.2 కోట్లకు పైమాటే. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సదురు యువకుడిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.


Next Story