పోలీస్‌ వాహనంపై యువతి రీల్స్‌.. అనుమతిచ్చిన అధికారిపై వేటు

ఓ యువతి పోలీస్‌ వాహనంపై రీల్ చేసింది. ఆ తర్వాత చిక్కుల్లో పడింది. ఓ పోలీస్‌ అధికారిపై వేటుకి కారణమైంది.

By Srikanth Gundamalla  Published on  29 Sept 2023 8:41 AM IST
young girl, reels,  police vehicle, suspension, viral video,

పోలీస్‌ వాహనంపై యువతి రీల్స్‌.. అనుమతిచ్చిన అధికారిపై వేటు 

యువత రీల్స్‌కు బాగా అడిక్ట్‌ అయిపోయారు. కొత్తకొత్తగా రీల్స్ చేయాలనుకుని ఏదో విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు కొత్త ప్రదేశాలను ఎంచుకుని టూర్‌లు ప్లాన్‌ చేసి రీల్స్‌ చేస్తే.. ఇంకొందరు భిన్నంగా ఆలోచించి కొత్తగా రీల్‌ చేయాలని ప్రమాదాల్లో పడుతున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే.. ఓ యువతి అందరికీ కాస్త భిన్నంగా ఆలోచించింది. పోలీసు వాహనం కనిపించడంతో ఆ కారుపై ఉండి రీల్‌ చేయాలనుకుంది. అనుకున్నట్లుగానే అక్కడుకున్న పోలీసుని అడిగి రీల్‌ చేసింది. కానీ.. ఆ తర్వాత రీల్‌ చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన పోలీసుకే చిక్కులు వచ్చిపడ్డాయి.

పంజాబ్‌లోని జలంధర్ నగరంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్ అశోక్‌ శర్మ రాత్రి వేళ పెట్రోలింగ్‌ వాహనం తీసుకుని బయటకు వెళ్లారు. రోడ్లపై తిరుగుతూ ఉన్నారు. ఆసమయంలో ఓ వయుతి పోలీసు కారు వద్దకు వచ్చింది. తాను రీల్‌ చేస్తానని అందుకు కారుని వినియోగించుకుంటానని రిక్వెస్ట్‌ చేసింది. దాంతో.. కాసేపు ఖాళీగా ఉన్న పోలీసు అధికారి అశోక్‌ శర్మ ఆ యువతిని రీల్‌ చేసుకునేందుకు అనుమతి ఇచ్చాడు. దాంతో ఆ యువతి కారు బ్యానెట్‌ పైకి ఎక్కి రీల్‌ చేసింది. డ్యాన్స్‌ చేస్తున్నట్లుగా చేతులు ఊపుతూ స్టెప్పులు వేసింది. అంతేకాదు.. పోలీస్ వాహనంపైనే కూర్చొని అభ్యంతరకరంగా వేళ్లతో సైగలు చేసింది. కాగా..ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది.

అటు తిరిగి ఇటు తిరిగి రీల్‌ చివరకు పోలీసు ఉన్నతాధికారుల వరకు చేరింది. ఆ యువతి అలా అభ్యంతరకరంగా చేతివేళ్లను చూపడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ సంఘటనపై ఆరా తీయగా.. యువతికి రీల్‌ చేసుకునేందుకు స్టేషన్ ఆఫీసర్ అశోక్‌ శర్మ అనుమతి ఇచ్చినట్లు తేలింది. దాంతో.. అశోక్‌ శర్మపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. యువతి వన్ మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు రావడంతో కొత్తగా వీడియో చేయాలని ఇలా పోలీసు వాహనంపై కూర్చొని రీల్‌ చేసి తాను చిక్కుల్లో పడటమే కాకుండా.. పోలీస్‌ అధికారిని ఇబ్బందుల్లో పడేసింది.

Next Story