తల్లి పరీక్ష రాస్తుంటే..బిడ్డను ఆడించి మానవత్వం చాటిన మహిళా కానిస్టేబుల్

గుజరాత్‌లో ఓ మహిళా కానిస్టేబుల్‌ మానవత్వం చాటిచెప్పింది.

By Srikanth Gundamalla  Published on  11 July 2023 1:52 PM IST
Woman Constable, Daya Ben, Gujarat, Exam Centre,

తల్లి పరీక్ష రాస్తుంటే..బిడ్డను ఆడించి మానవత్వం చాటిన మహిళా కానిస్టేబుల్

గుజరాత్‌లో ఓ మహిళా కానిస్టేబుల్‌ మానవత్వం చాటిచెప్పింది. పరీక్షకు చంటిబిడ్డతో పాటు హాజరైంది ఓ అభ్యర్థురాలు. పరీక్ష సమయంలో చిన్నారి ఆలనపాలనా చూసి మానత్వం చాటుకుంది. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే.. తల్లికి అండగా నిలబడటాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి మహిళా కానిస్టేబుల్‌ను అభినందించారు.

గుజరాత్‌ హైకోర్టులో ప్యూన్‌ పోస్టులకు గత ఆదివారం రాత పరీక్ష నిర్వహించారు అధికారులు. ఈ పరీక్ష రాసేందుకు ఓ మహిళ ఆరు నెలల చంటిబిడ్డతో ఎగ్జామ్‌ సెంటర్‌కు వచ్చింది. అయితే.. సరిగ్గా పరీక్ష రాసేందుకు తల్లి వెళ్తుండగా బిడ్డ ఏడుపు ప్రారంభించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అటు పరీక్షకు సమయం మించిపోతోందని ఆ తల్లి ఎంతో ఆవేదన చెందింది. ఇది గమనించింది అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ దయా బెన్. సదురు మహిళ వద్దకు వెళ్లి నేను బిడ్డను చూసుకుంటాను.. మీరు వెళ్లి పరీక్ష రాయండని చెప్పింది. దాంతో ఆ తల్లి బిడ్డను మహిళా కానిస్టేబుల్‌కు అప్పజెప్పి ఎగ్జామ్‌ రాసింది. పరీక్ష జరుగుతున్నంత సేపు కానిస్టేబుల్‌ దయా బెన్ చిన్నారిని ఆడిస్తూ.. దాంతో పాటే విధులనూ నిర్వర్తించింది. దీకికి సంబంధించిన ఫోటోలను గుజరాత్‌ పోలీసులు తమ ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు. దాంతో ఆమె ఫోటోలు వైరల్‌ అయ్యాయి. పరీక్ష రాసేందుకు వచ్చిన తల్లికి అండగా నిలబడి.. విధులు నిర్వరిస్తూనే మానవత్వం చాటుకున్న దయా బెన్‌ను నెటిజన్లు పొగుడుతున్నారు.

ఇక మహిళా కానిస్టేబుల్‌ దయాబెన్‌ చేసిన పనికి పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం నుంచి కూడా ప్రశంసలు అందాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌ డీజీపీ దయాబెన్‌ను ప్రశంసిస్తూ ఓ లేఖను అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా డీజీపీ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. మంచి పని చేసిన ఆమెకు ఇతర పోలీసులు కూడా సెల్యూట్‌ చేస్తున్నారు.

Next Story