ట్రాఫిక్‌లో ఇరుక్కున్న రైలు.. వైరల్ వీడియో

దేశంలోని కొన్ని నగరాల్లో ట్రాఫిక్‌ మామూలుగా ఉండదు.

By Srikanth Gundamalla  Published on  26 Sep 2024 9:09 AM GMT
ట్రాఫిక్‌లో ఇరుక్కున్న రైలు.. వైరల్ వీడియో

దేశంలోని కొన్ని నగరాల్లో ట్రాఫిక్‌ మామూలుగా ఉండదు. అప్పుడప్పుడు నాలుగైదు కిలోమీటర్ల దూరానికే గంటకు పైగా సమయం పడుతుంది. బెంగళూరులో ట్రాఫిక్‌ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ నగర ట్రాఫిక్‌లో రైలు కూడా ఇరుక్కుపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మారతహల్లి దగ్గరున్న మున్నెకోళ్ల రైల్వే క్రాసింగ్ దగ్గర ఇది జరిగింది. మున్నెకోళ్ల రైల్వే క్రాసింగ్‌ వద్ద వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. గంటల సమయం గడిచినా వాహనాలు ముందుకు కదల్లేదు. ఇక కాసేపటికే ఆ రూట్‌లో రైలు వచ్చింది. ట్రాక్‌పై ఉన్న వాహనాలను గమనించిన లోకో పైలట్‌ ట్రైన్ ను నిలిపేశాడు. చాలా సమయం వరకు వాహనాలు క్లియర్ కాకపోవడంతో రైలు సైతం ట్రాఫిక్‌కు ఎఫెక్ట్ అయ్యింది. కాగా.. దీన్నంతా అక్కడున్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ట్రాఫిక్‌ కారణంగా రైలు ఆగిపోవడంతో చర్చనీయాంశం అయ్యింది. ట్రాఫిక్‌తో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా మున్నెకోళ్ల రైల్వే క్రాసింగ్‌ వద్ద బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

మరోవైపు ఈ వైరల్ వీడియోపై ఆగ్నేయ రైల్వే స్పంధించింది. కేరళ వెళ్తున్న ఈ రైలులో సాంకేతిక లోపం ఏర్పడిందని తెలిపింది. ఈ నేపథ్యంలో మున్నెకోళ్ల రైల్వే క్రాసింగ్ వద్ద రైలును నిలిపి లోకో పైలెట్ తనిఖీలు చేపట్టారని వివరణ ఇచ్చింది. అంతేకానీ ట్రాఫిక్‌ సమస్య కాదని ఆగ్నేయ రైల్వే స్పష్టం చేసింది. మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపింది.


Next Story