కదులుతున్న కారుపై నిద్రిస్తున్న చిన్నారులు.. వైరల్ వీడియో
కదులుతున్న కారుపై ఇద్దరు చిన్నారులు పడుకుని నిద్రపోతున్నారు.
By Srikanth Gundamalla Published on 29 Dec 2023 10:27 AM IST
కదులుతున్న కారుపై నిద్రిస్తున్న చిన్నారులు.. వైరల్ వీడియో
కదులుతున్న కారుపై ఇద్దరు చిన్నారులు పడుకుని నిద్రపోతున్నారు. ఈ సంఘటన గోవాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారుపై చిన్నారులు పడుకుని ఉన్న సమయంలో డ్రైవర్ కారును అలాగే ముందుకు నడిపిస్తున్నాడు. ఓ వ్యక్తి వచ్చి కారు టాప్‌పైన ఇద్దరు చిన్నారులు ఉన్నారనీ.. పడుకుని ఉండటం చూసుకోలేదా అని ప్రశ్నించాడు. మరికొందరు వ్యక్తులు వచ్చి కారు డ్రైవర్‌ను వారించినా పట్టించుకోలేదు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సదురు వ్యక్తి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గోవాలోని మపుసా పట్టణ సమీపంలో ఈ సంఘటన వెలుగు చూసింది. కదులుతున్న కారుపై ఇద్దరు చిన్నారులు ప్రమాకర రీతిలో నిద్రిస్తూ కనిపించారు. పర్రా గ్రామంలో బుధవారం ఓ టూరిస్టు వాహనంలో వెళ్తుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కదులుతున్న ఎక్స్‌యూవీ కారుపై భాగంలో ఇద్దరు పిల్లలు పడుకుని ఉన్నారు. ఓ వీడియో తీస్తూ సదురు కారు డ్రైవర్‌ను ప్రశ్నించాడు. కానీ.. అతను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో డిసెంబర్ 27న సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ వీడియోను చూసి నెటిజన్లు సదురు కారు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం విచారకరం అని చెబుతున్నారు. రిలాక్స్ అవడానికి గోవాకు వెళ్తారు.. కానీ జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యమని అంటున్నారు. ఇది పిల్లలకు తప్పుడు సందేశాన్ని ఇస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఇది సాధారణమే అనుకున్నా.. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే బాధపడినా ప్రయోజనం ఉండదని అంటున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవడం ముఖ్యమంటూ పలువురు కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఈ వీడియోను పోస్టు చేస్తూ పోలీసులను ట్యాగ్ చేస్తున్నారు. దీనిపై విచారణ జరిపి ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన మాపుసా పోలీసులు కారు నడిపిన గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా.. సదురు కారు తెలంగాణ రిజిస్ట్రేషన్ బోర్డుతో ఉండటం గమనార్హం.
Absolutely insane! How TF do you as a parent even think this is a safe thing to do? #Goa pic.twitter.com/J9b27T9Top
— That Goan Guy (@schmmuck) December 27, 2023