ట్రాఫిక్ పోలీస్‌ను కారుపై 4 కి.మీలు లాక్కెళ్లిన వ్య‌క్తి.. వీడియో

Video To Escape Challan Mp Driver Drags Traffic Cop On Car Bonnet For 4km. ట్రాఫిక్‌ పోలీస్‌ చలాన్‌ నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి దారుణానికి యత్నించాడు.

By అంజి  Published on  13 Dec 2022 11:03 AM IST
ట్రాఫిక్ పోలీస్‌ను కారుపై 4 కి.మీలు లాక్కెళ్లిన వ్య‌క్తి.. వీడియో

ట్రాఫిక్‌ పోలీస్‌ చలాన్‌ నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి దారుణానికి యత్నించాడు. మొబైల్‌ ఫోన్‌ మాట్లాడుతూ కారు నడుపుతున్న వ్యక్తిని ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శివ్ సింగ్ చౌహాన్ ఆపాడు. చలాన్‌ చెల్లించాలని పోలీసు కోరడంతో డ్రైవర్‌ నిరాకరించడంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసు కారుకు అడ్డంగా నిలబడ్డాడు. అయితే ఆ వ్యక్తి కారును ముందుకు రానివ్వడంతో పోలీసు.. కారు బ్యానెట్‌ మీద ఎక్కాడు. అప్పటికే ఆ వ్యక్తి కారు ఆపకుండా ముందుకుపోనిచ్చాడు. ఈ ఘటన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో సత్యసాయి క్రాసింగ్ వద్ద జరిగింది.

బ్యానెట్‌పై నుంచి పోలీసు కింద పడిపోవాలని ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద కారును అటు ఇటు తిప్పుతూ డ్రైవింగ్‌ చేశాడు. అంతేకాదు కారు బ్యానెట్ మీద ఉన్న‌ ఆ పోలీసును ఏకంగా 4 కిలోమీట‌ర్లు లాక్కెళ్లాడు. డ్రైవర్ తన కారును ఇతర కార్లకు దగ్గరగా నడిపిస్తూ, బ్రేకులు వేయడం ద్వారా కానిస్టేబుల్‌ను పడేలా చేయడానికి అనేకసార్లు విఫల ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికీ, పోలీసు గట్టిగా పట్టుకున్నాడు. ఆ తర్వాత వేగంగా వెళ్తున్న కారు డ్రైవర్‌ను పట్టుకోవడానికి పోలీసులు చుట్టుముట్టవలసి వచ్చింది. ఎట్టకేలకు పోలీసులు అడ్డుకుని లాసుడియా పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనాన్ని బలవంతంగా ఆపారు.

డ్రైవర్‌ను గ్వాలియర్‌కు చెందిన కేశవ్ ఉపాధ్యాయ్‌గా గుర్తించారు. లాసుడియా పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్ 353 (ప్రభుత్వ సేవకుడిని తన విధులను నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా క్రిమినల్ ఫోర్స్), 279 (ర్యాష్ డ్రైవింగ్), 332 కింద నిందితుడిపై కేసు నమోదు చేయబడింది. లాసుడియా పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆర్‌ఎస్ దండోటియా ప్రకారం.. గ్వాలియర్‌కు చెందిన నిందితుడి నుంచి తుపాకీ, రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. "ఈ ఆయుధాలకు లైసెన్స్ ఉందని నిందితుడు పేర్కొన్నాడు. మేము దానిని పరిశీలిస్తున్నాము" అని అధికారి తెలిపారు.


Next Story