Viral Video : పానీ పూరీ మిశ్రమంలో బతికున్న ఎలుక.. తినేవారంతా..
మీరు బయట గోల్గప్పాస్ (పానీ పూరీ) తినేవారయితే.. ఈ వార్త మీ కోసమే. పంజాబ్‌లోని అమృత్సర్ నుండి ఒక వీడియో వెలువడింది
By - Medi Samrat |
మీరు బయట గోల్గప్పాస్ (పానీ పూరీ) తినేవారయితే.. ఈ వార్త మీ కోసమే. పంజాబ్‌లోని అమృత్సర్ నుండి ఒక వీడియో వెలువడింది. ఇది సోషల్ మీడియాలో పరిశుభ్రత విషయమై చర్చకు దారితీసింది. వైరల్ వీడియోలో పానీ పూరీలో వాడే నీళ్ల మిశ్రమం ఉన్న పాత్ర లోపల ఒక బతికి ఉన్న ఎలుక పడి తేలుతూ కనిపిస్తుంది.
ఇద్దరు యువకులు ఒక వీధి వ్యాపారి వద్ద పానీ పూరీ తింటుండగా ఈ సంఘటన జరిగింది. వారు తాము తింటున్న వీడియోను రికార్డ్ చేస్తుండగా.. అకస్మాత్తుగా నీటి మిశ్రమం ఉన్న కంటైనర్ గమనించారు. దుకాణదారుడు నీటి మిశ్రమాన్ని కదిలించగా.. అందులో ఒక ఎలుక తేలుతూ కనిపించింది. ఆ తర్వాత అది కంటైనర్ నుండి దూకి పారిపోయింది. దీనిని చూసి అక్కడ ఉన్న కస్టమర్లు ఆశ్చర్యపోయారు.
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ కరణ్ ధంజు షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది వీక్షించారు. అయితే.. ఈ సంఘటన అమృత్‌సర్‌లో ఏ ప్రాంతంలో జరిగిందనేది తెలియదు. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత కరణ్ ధంజు మాట్లాడుతూ "నేను నా వీడియోను రికార్డ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఒక ఎలుక వచ్చి నీటిలోకి దూకింది. నేను దానిని చూసిన వెంటనే కెమెరాను ఆ వైపుకు తిప్పాను. దుకాణదారుడు వెంటనే ఎలుకను బయటకు తీసి పానీ పూరీ విశ్రమం నీళ్లన్నీ పారబోశాడు. ఇందులో ఎవరి తప్పు లేదు. మేము దీన్ని చూడకపోతే ఆ నీరు మా కడుపులో ఉండేదని, మీరు కూడా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి అని కరణ్ వైరల్ వీడియోలో అన్నారు.
వీడియోను చిత్రీకరించిన యువకుడు ఇది ప్రమాదవశాత్తు జరిగిందని పేర్కొన్నప్పటికీ, సోషల్ మీడియా వినియోగదారులు ఈ అంశంలో రెండు వర్గాలుగా విడిపోయి.. కొందరు దీనిని నిర్లక్ష్యం, ఆహార భద్రత పట్ల శ్రద్ధ లేకపోవడం అని విమర్శించారు. కొంతమంది వినియోగదారులు ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదని, పొరపాటున జరిగిందని పేర్కొన్నారు.