కొత్త ఐడియా సూపర్.. సైలెంట్‌ బరాత్‌ వీడియో వైరల్

ఓ పెళ్లి వేడుకలో కొత్త ఐడియాను పరిచయం చేశారు. అదే సైలెంట్ బరాత్.

By Srikanth Gundamalla  Published on  7 Jan 2024 2:03 AM GMT
silent baraat, viral video, social media,

కొత్త ఐడియా సూపర్.. సైలెంట్‌ బరాత్‌ వీడియో వైరల్ 

పెళ్లి అంటేనే సందడి. బంధువులు.. బ్యాండ్‌ చప్పుడు.. డీజే మోతలు.. ఆటలు.. పాటలు ఇలా అన్నీ ఉంటాయి. అయితే.. ముఖ్యంగా బరాత్‌ గురించి చెప్పుకోవాలి. కొందరు బరాత్‌ను అంగరంగ వైభవంగా తీస్తుంటారు. పెళ్లితో పాటు బరాత్‌కు చాలా వరకు ప్రాధాన్యత ఇస్తారు. కొందరు బ్యాండ్‌ పెడితే.. ఇంకొందరు డీజే పెట్టి బరాత్‌ నిర్వహిస్తారు. అయితే.. ఇలా పెద్ద శబ్దాలు చేయడం ద్వారా అందరికీ నష్టమే. వేడుక నెక్ట్స్‌ లెవెల్‌లో ఉండటం కోసం పెట్టే డీజేలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పెద్ద సౌండ్ల మధ్య డ్యాన్స్‌ చేస్తూ కొందరు హార్ట్‌ స్ట్రోక్ వచ్చి ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు.. ఇలాంటి డీజేల వద్ల శబ్ద కాలుష్యం కూడా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఓ పెళ్లి వేడుకలో కొత్త ఐడియాను పరిచయం చేశారు. అదే సైలెంట్ బరాత్. సైలెంట్‌గా బరాత్ ఎలా తీస్తారు అని అనుకుంటున్నారా? ఇందులో పాటలు ఉంటాయి. కానీ శబ్దకాలుష్యం జరుగదు. ఓ పెళ్లి బరాత్‌లో భారీ బాక్సులకు బదులు అతిథులకు హెడ్‌ఫోన్‌లు ఇచ్చారు. అందులో వచ్చే మ్యూజిక్‌కు స్టెప్పులేస్తున్నారు. ఎంజాయ్‌ ఒక పక్క జరుగుతూనే ఉంది. మరోవైపు పాటలు నడుస్తున్నాయి. పైగా శబ్ద కాలుష్యం జరగడం లేదు.చుట్టుపక్కల ఉన్నవారికి కూడా ఎవరికీ ఇబ్బంది కలగడం లేదు. ఇది ఎక్కడ జరిగిందనేది తెలియదు కానీ.. సైలెంట్ బరాత్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు వావ్‌ సూపర్‌ ఐడియా బాసూ అంటున్నారు.

ఈ వీడియోను ఓ ఇన్ స్టాగ్రామ్ యూజర్ ‘సైలెంట్ బరాత్’ ట్యాగ్ లైన్‌తో పోస్టు చేయగా దీనిపై నెటిజన్లు ఆసక్తికరంగా రియాక్ట్ అవుతున్నారు. సైలెంట్‌ డిస్కో కాన్సెప్ట్ బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇంకొందరు అతిథులు తమకు ఇచ్చిన హెడ్‌ఫోన్స్‌తో పరారు అయితే పరిస్థితి ఏంటని.. ఇలా హెడ్‌ఫోన్స్‌ ఎవరికి వారు పెట్టుకుని స్టెప్పులు వస్తే కిక్‌ ఉండదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక చూసేవారికి కూడా ఇది ఫన్నీగా అనిపిస్తుందని అంటున్నారు. అయితే.. భారీ శబ్దాలు లేకుండా.. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా వచ్చి ఈ సైలెంట్ బరాత్‌ ఐడియా ఎంతవరకు ముందుకెళ్తుందో..!


Next Story