Video: చావు నోట్లోంచి తప్పించుకుని.. 17 కి.మీ నడిచి ఇంటికి చేరిన ఏడు శునకాలు!

ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రాంచానికి చెందిన ఏడు పెంపుడు కుక్కలు కుక్క మాంసం వ్యాపారుల నుండి చాకచక్యంగా తప్పించుకున్నాయి.

By -  అంజి
Published on : 24 March 2026 11:44 AM IST

China Viral Dog Video, Dog Meat Trade Escape, Intelligent Corgi Leader, Jilin Province, Animal Rescue Drone, Heartwarming Dog Reunion, Changchun Highway

Video: చావు నోట్లోంచి తప్పించుకుని.. 17 కి.మీ నడిచి ఇంటికి చేరిన ఏడు శునకాలు!

ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రాంచానికి చెందిన ఏడు పెంపుడు కుక్కలు కుక్క మాంసం వ్యాపారుల నుండి చాకచక్యంగా తప్పించుకున్నాయి. నిందితులు వాటిని తరలిస్తున్న వాహనం నుండి అవి ఎలాగోలా బయటపడి, తమ సొంత గ్రామానికి చేరుకోవడానికి ఏకంగా 17 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. మార్చి 16న చాంగ్‌చున్ నగరంలోని ఒక రద్దీగా ఉండే హైవేపై ఈ దృశ్యాన్ని చూసిన లు అనే వ్యక్తి తన మొబైల్‌లో బంధించారు. ఈ వీడియో ఇప్పుడు చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'డౌయిన్' (Douyin) లో మిలియన్ల మందిని ఆకట్టుకుంటోంది.

హైవేపై ఆ కుక్కలు నడుస్తున్న తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అవి వీధి కుక్కల్లా కాకుండా, ఒక క్రమశిక్షణ కలిగిన బృందంలా కదులుతున్నాయని లు తెలిపారు. ఒక 'కార్గి' జాతి కుక్క ఈ బృందానికి నాయకత్వం వహిస్తూ, దారి చూపుతూ మధ్యమధ్యలో వెనక్కి తిరిగి మిగిలిన వాటిని గమనిస్తూ సాగింది. ఈ గుంపులో గాయపడిన ఒక 'జర్మన్ షెపర్డ్' కూడా ఉంది. మిగిలిన కుక్కలన్నీ ఆ గాయపడిన జర్మన్ షెపర్డ్ వెంటే ఉంటూ, దానికి అండగా నడుస్తూ తమ మధ్య ఉన్న గాఢమైన బంధాన్ని చాటుకున్నాయి.

డ్రోన్ల సాయంతో సురక్షితంగా ఇంటికి..

వీడియో వైరల్ కావడంతో స్థానిక జంతు సంరక్షణ సంస్థ 'బిట్టర్ కాఫీ స్ట్రే డాగ్ బేస్' రంగంలోకి దిగింది. డ్రోన్ల సాయంతో ఆ కుక్కల కదలికలను గమనిస్తూ, అవి సురక్షితంగా గ్రామానికి చేరుకునేలా వాలంటీర్లు సహాయం చేశారు. మార్చి 19 నాటికి ఆ ఏడు కుక్కలు క్షేమంగా తమ యజమానుల వద్దకు చేరుకున్నాయని స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి. తన జర్మన్ షెపర్డ్ మరియు గోల్డెన్ రిట్రీవర్ తిరిగి వచ్చినందుకు ఒక యజమాని సంతోషం వ్యక్తం చేయగా, తన కార్గి కుక్క చాలా తెలివైనదని, దారి వెతుక్కోవడంలో దానికి సాటి లేదని మరో యజమాని గర్వంగా చెప్పారు.

Next Story