క్యాబ్ డ్రైవర్ అకౌంట్లోకి రూ.9వేల కోట్లు, రూ.21వేలు వాడుకున్న తర్వాత..
ఓ క్యాబ్ డ్రైవర్ బ్యాంకు అకౌంట్‌లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.9వేల కోట్లు జమ అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 21 Sept 2023 3:15 PM IST
క్యాబ్ డ్రైవర్ అకౌంట్లోకి రూ.9వేల కోట్లు, రూ.21వేలు వాడుకున్న తర్వాత..
అప్పుడప్పుడు బ్యాంకు అధికారులు చేసే పొరపాట్ల కారణంగా డబ్బులు ఇతరుల ఖాతాల్లోకి వెళ్తుంటాయి. వెంటనే చూసుకుంటే ఖాతాదారుడికి సమాచారం ఇచ్చి ఆ డబ్బులను రిటర్న్‌గా తీసుకుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. ఓ క్యాబ్ డ్రైవర్ బ్యాంకు అకౌంట్‌లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.9వేల కోట్లు జమ అయ్యాయి. ఆ అమౌంట్ చూసిన బ్యాంక్ ఖాతాదారుడికి దిమ్మతిరిగింది.
పళని సమీపంలోని నైక్కరిపట్టి గ్రామానికి ఎందిన రాజ్‌కుమార్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తోటి క్యాబ్ డ్రైవర్లతో కలిసి కోడంబాక్కంలో గదిని అద్దెకు తీసుకుని క్యాబ్ నడుపుకుంటున్నాడు. సెప్టెంబర్ 9న రాజ్‌కుమార్ ఇంటి వద్దే ఉన్నాడు. మధ్యాహ్నం సమయంలో కాసేపు నిద్రపోయాడు. లేచి చూడగానే అతడి ఫోన్‌కు ఒక మెసేజ్ వచ్చింది. ట్యాక్సీ డ్రైవర్ రాజ్‌కుమార్ ఖాతాలో రూ.9వేల కోట్లు జమ అయ్యాయి. అది చూసిన రాజ్‌కుమార్ మొదట షాక్ అయ్యాడు.. ఆ తర్వాత స్నేహితులు ఆట పట్టించేందుకు అలా చేశారని భావించాడు. అయితే.. మెసేజ్‌ను రిపీట్‌గా చదవడం ద్వారా తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ నుంచి వచ్చిన అధికారిక మెసేజ్‌గా గుర్తించాడు.
బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అయ్యిన మొదటి 30 నిమిషాల్లో బ్యాంకు ఆ డబ్బులను తిరిగి తీసుకునే లోపు.. రూ.21వేలు స్నేహితుడికి ట్రాన్స్‌ఫర్ చేశాడు. కాగా.. అంతపెద్దమొత్తంలో డబ్బులు జమ అవ్వడం.. మొదట చూసి సున్నాలు ఎక్కువగా ఉండటంతో డబ్బులు మొత్తం ఎన్ని జమ అయ్యాయో లెక్కించలేకపోయానని రాజ్‌కుమార్ తెలిపాడు. 9వేల కోట్ల రూపాయలు జమ అవ్వడానికి ముందు తన ఖాతాలో రూ.105 మాత్రమే ఉన్నాయని చెప్పాడు. రూ.21వేలు స్నేహితుడికి పంపిన తర్వాత కాసేపటికే మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ద్వారా డెబిట్ చేయబడిందని రాజ్‌కుమార్ తెలిపాడు.
ఇక మరుసటి రోజు ఉదయం టీఎంబీ అధికారులు రాజ్‌కుమార్‌ను సంప్రదించారు. డబ్బు పొరపాటున జమ అయ్యిందని తెలిపారు. తీసుకున్న డబ్బులు చెల్లించాలని చెప్పారు. ఇంటికి వచ్చిన అధికారుల్లో ఒకరు రాజ్‌కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో..న్యాయవాదితో కలిసి బ్యాంకు వద్దకు వెళ్లాడు క్యాబ్ డ్రైవర్. అక్కడ ఇరువర్గాల మధ్య చర్చలు జరిగాయి. బ్యాంకు అధికారుల తప్పుగా న్యాయవాది వాదించాడు. దాంతో ఇరువర్గాలు రాజీ కుదుర్చుకున్నారు. విత్‌డ్రా చేసిన డబ్బులు తిరిగి ఇవ్వనవసరం లేదని, అంతేకాకుండా బ్యాంకు అధికారులు కారు లోన్ కూడా ఆఫర్ చేశారని క్యాబ్ డ్రైవర్ రాజ్‌కుమార్ తెలిపాడు.
BREAKING: ₹9000 crore deposited to a car driver bank account by Tamilnadu Mercantile Bank in Chennai. pic.twitter.com/VVjPbB9cgy
— Manobala Vijayabalan (@ManobalaV) September 21, 2023