కాలేజీలో ప్రిన్సిపాల్ కొడుకు పెళ్లి.. ఇది కల్యాణ మండపం కాదంటూ విద్యార్థుల ధర్నా!

సాధారణంగా విద్యాసంస్థలు జ్ఞాన సముపార్జనకు నిలయాలు. కానీ, ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక హన్సరాజ్ కాలేజీ ఈ వారం ఒక ప్రైవేట్ వెడ్డింగ్ వెన్యూలా మారిపోయింది.

By -  అంజి
Published on : 11 Feb 2026 11:27 AM IST

Hansraj College Wedding Controversy, Principal Rama Sharma Son Wedding, Delhi University Campus Misuse Allegations, SFI Protest Hansraj College

కాలేజీలో ప్రిన్సిపాల్ కొడుకు పెళ్లి.. ఇది కల్యాణ మండపం కాదంటూ విద్యార్థుల ధర్నా!

సాధారణంగా విద్యాసంస్థలు జ్ఞాన సముపార్జనకు నిలయాలు. కానీ, ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక హన్సరాజ్ కాలేజీ ఈ వారం ఒక ప్రైవేట్ వెడ్డింగ్ వెన్యూలా మారిపోయింది. కాలేజీ ప్రిన్సిపాల్ రమా శర్మ తన కుమారుడి వివాహ వేడుకల కోసం కాలేజీ మైదానాన్ని, మౌలిక సదుపాయాలను వినియోగించుకోవడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. కాలేజీ ప్రాంగణంలో భారీ టెంట్లు, రంగురంగుల పందిళ్లు, పెళ్లి అలంకరణలు వెలిశాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు.

ప్రభుత్వ విద్యా సంస్థను వ్యక్తిగత శుభకార్యాల కోసం ఎలా వాడుకుంటారని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ఆధ్వర్యంలో 200 మందికి పైగా విద్యార్థులు సోమవారం నిరసన చేపట్టారు. విద్యార్థులను సాయంత్రం 4 గంటల తర్వాత మైదానంలో ఆడుకోవడానికి అనుమతించని యాజమాన్యం, పెళ్లి వేడుకలకు ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు. వార్షిక 'ఖేలో హన్సరాజ్' స్పోర్ట్స్ టోర్నమెంట్‌ను పెళ్లి ఏర్పాట్ల కోసం వాయిదా వేయడంపై క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కాలంగా "నివసించడానికి యోగ్యం కాదు" అని మూసివేసిన కాలేజీ హాస్టల్‌ను, ఇప్పుడు పెళ్లి అతిథుల కోసం గెస్ట్ హౌస్‌గా మార్చడంపై విద్యార్థులు మండిపడుతున్నారు.

పెళ్లి స్టేజీ కోసం గుంతలు తీయడం వల్ల కాలేజీ గ్రౌండ్ దెబ్బతింటుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అటు ఈ వివాదంపై ఢిల్లీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వికాస్ గుప్త స్పందించారు. ఇందులో వివాదం చేయాల్సిన అవసరం లేదని ఆయన కొట్టిపారేశారు. "ప్రిన్సిపాల్ కాలేజీ కేటాయించిన నివాసంలోనే ఉంటున్నారు. తన నివాసంలో ఇటువంటి వ్యక్తిగత వేడుకలు నిర్వహించుకునే హక్కు ఆమెకు ఉంది. గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి" అని ఆయన స్పష్టం చేశారు. అయితే, ప్రిన్సిపాల్ రమా శర్మ మాత్రం ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు.

Next Story