విమానంలో విరాళాల సేకరణ.. నెట్టింట తెగ వైరలవుతోన్న వీడియో
పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి భిన్నంగా ఆలోచించాడు. విమానంలో సీట్ల మధ్యలో నిలబడి విరాళాలు అడిగాడు.
By Srikanth Gundamalla Published on 15 July 2023 12:24 PM IST
విమానంలో విరాళాల సేకరణ.. నెట్టింట తెగ వైరలవుతోన్న వీడియో
మనం రోడ్లపై వెళ్తున్నప్పుడు.. లేదంటే బస్సుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడో కొందరు వచ్చి విరాళాలు ఇవ్వాలని అడగడం చూశాం. కానీ విమానంలో? చూసి ఉండరు కదూ..! ఎందుకంటే విమానాల్లో దాదాపుగా వ్యాపారస్తులు, సెలబ్రిటీలు, ప్రముఖులే ప్రయాణాలు చేస్తుంటారు. అంతేకాని.. కేవలం విరాళాల సేకరణ కోసం విమానం ఎక్కేవారు ఎవరు..? టికెట్ కోసం చేయాల్సిన ఖర్చు గురించి ఆలోచిస్తారు కదా. కానీ..పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి భిన్నంగా ఆలోచించాడు. విమానంలో సీట్ల మధ్యలో నిలబడి విరాళాలు అడిగాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏ విమానంలో జరిగిందన్న విషయంలో క్లారిటీ లేదు కానీ.. విమానంలో గాల్లోకి ఎగిరాక పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి లేచి సీట్ల మధ్యలో నిలబడ్డాడు. మెల్లిగా తన ప్రసంగాన్ని మొదలు పెట్టాడు. 'మేం మదర్సా కట్టడం కోసం విరాళాలు సేకరిస్తున్నాం. మీరు డబ్బు ఇవ్వదలుచుకుంటే నా వద్దకు వచ్చి ఇవ్వనవసరం లేదు. నేనే మీట్ల సీట్ల వద్దకు వస్తాను. అప్పుడు మీరు ఇవ్వాలనుకునే డబ్బుని నాకు ఇవ్వొచ్చు. నేనేమీ భిక్షాటన చేయడం లేదు. నాకు సాయం మాత్రమే చేయండని కోరుతున్నాను' అని పాకిస్తానీ అనడం వీడియోలో కనిపించింది. అయితే.. వీడియో ఎప్పుడు తీశారు అనేది తెలియలేదు. కానీ రెండువారాల నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందరికీ భిన్నంగా విరాళాలు వ్యక్తి విమానంలో అడగడంతో ప్రయాణికులంతా షాక్ అయ్యారు.
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో పోరాడుతోంది. ఈ క్రమంలో వీడియో వైరల్ అవ్వడంతో పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. వీడియోలో కనిపించే వ్యక్తి పాకిస్థాన్ సోషల్ మీడియా సెన్సేషన్ అక్తర్ లావా అని కొందరు అంటున్నారు. అతను రాజకీయనాయుడు కూడా. కామెడీ వీడియోలు చేస్తుంటాడని అంటున్నారు. గతేడాది నుంచి వైరల్ కంటెంట్లు చేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. ఇప్పుడు విమానంలో విరాళాలు అడిగిన వీడియో కూడా ఫన్ కోసం, పాపులారిటీని మరింత పెంచేందుకే చేశాడమో అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Viral video whereby a Pakistani can be seen begging in a flight; Says I am not a beggar but need money to make a madrasas in Pakistan. pic.twitter.com/hUB3ZzVJGn
— Megh Updates 🚨™ (@MeghUpdates) July 13, 2023