ప్రియుడిని పెళ్లాడేందుకు భారత్‌ వచ్చిన పాక్‌ యువతి

కొందరు ప్రేమించిన వారిని పెళ్లాడేందుకు ఇతర దేశాల నుంచి సరిహద్దులు దాటి వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు.

By Srikanth Gundamalla  Published on  6 Dec 2023 5:28 AM GMT
pakistan girl,  india,   marriage,

ప్రియుడిని పెళ్లాడేందుకు భారత్‌ వచ్చిన పాక్‌ యువతి 

ప్రేమ వివాహాలు ఎక్కువై పోతున్నాయి. కొందరు ప్రేమించిన వారిని పెళ్లాడేందుకు ఇతర దేశాల నుంచి సరిహద్దులు దాటి వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఇలాంటి ప్రేమ వివాహాలు మన దేశంలో ఇటీవల చాలా జరిగాయి. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే.. తాజాగా ఇలాంటి ప్రేమ వివాహానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతి భారత్‌కు చెందిన యువకుడిని పెళ్లాడేందుకు దేశ సరిహద్దులు దాటి వచ్చింది.

పశ్చిమబెంగాల్‌కు చెందిన సమీర్‌ఖాన్‌ అనే యువకుడు జర్మనీలో చదువుకున్నాడు. అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమలోనే అతను 2018లో కుటుంబ సభ్యులను చూసేందుకు భారత్‌కు వచ్చాడు. ఆ సమయంలో అతడు తన తల్లి మొబైల్‌ ఫోన్లో ఒక యువతి ఫొటో చూశాడు. ఆమెను చూసిన సమీర్‌ఖాన్‌ మంత్రముగ్ధుడు అయ్యాడు. ఆమె అందానికి ఫిదా అయ్యాడు. ఎలాగైనా సరే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. పేరెంట్స్‌ ఎలాగైనా ఆ అమ్మాయితో మాట్లాడాలి అంటూ కోరాడు. వారు అది ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. కానీ సమీర్‌ఖాన్‌ పట్టువదల్లేదు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని లేదంటే ఇంకెవరిని చేసుకోను అని తెగేసి చెప్పాడు.

అయితే.. సమీర్‌ఖాన్ తల్లిదండ్రులు ఆ యువతి వివరాలు తెలుసుకున్నారు. సుదరు యువతి పేరు జవేరియా ఖానుమ్ అని.. యువతి పాకిస్థానీ అని గుర్తించారు. ఆ తర్వాత ఆమె తల్లిండ్రుల కాంటాక్ట్‌ నంబర్స్‌ తీసుకుని వారితోనూ మాట్లాడారు. ఒకరి గురించి మరొకరు అంతా తెలుసుకున్నారు. పెళ్లి సంబంధం కూడా ఖాయం చేసుకున్నారు. వెంటనే పెళ్లి జరిపించాలని కూడా అనుకున్నారు. కానీ కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. సమీర్‌కాన్‌ ఉద్యోగరీత్యా జర్మనీ వెళ్లాడు. ఆ తర్వాత కరోనా సమయం కొన్నాళ్లు వెయిట్‌ చేయించింది. అయితే.. జవేరియా ఖానుమ్‌ భారత్‌కు వచ్చేందుకు రెండు సార్లు ప్రయత్నించింది. వీసా తిరస్కరణకు గురి కావడం ఇలాంటి కొన్ని కారణాలు వీరి వివాహానికి అడ్డుపడ్డాయి.

2018 నుంచి సమీర్‌ఖాన్, జవేరియా ఒక్కసారి కూడా కలవలేదు. కాని ఫోన్లో టచ్‌లోనే ఉన్నారు. రోజు మాట్లాడుకునేవారు. దాంతో.. వీరిద్దరు ఒకరినొకరు మరింత అర్థం చేసుకుని ప్రేమబంధంలో మరింత లోతుగా వెళ్లిపోయారు. కాగా.. తాజాగా జవేరియాకు 45 రోజుల గడువుతో భారత ప్రభుత్వం వీసా ఇచ్చింది. డిసెంబర్ 5న జవేరియా భారత్‌లోని పంజాబ్‌కు వచ్చింది. దాంతో.. జవేరియాను సమీర్‌ఖాన్‌ కోల్‌కతాకు తీసుకెళాడు. కాబోయే కోడలికి సమీర్‌ఖాన్ తల్లిదండ్రులు ఘనంగా స్వాగతం పలికారు. కాగా.. జనవరిలో మొదటివారంలోనే వీరి వివాహం జరగనుందట.


Next Story