ఊహించని ఘటన.. గాల్లో తెరుచుకున్న విమానం పైకప్పు..చివరకు

నెదర్లాండ్స్‌లో ఓ మహిళా పైలట్‌కు ఊహించని అనుభవం ఎదురైంది.

By Srikanth Gundamalla  Published on  26 Jun 2024 6:57 AM IST
netherlands, flight,  top open, viral video, woman pilot,

ఊహించని ఘటన.. గాల్లో తెరుచుకున్న విమానం పైకప్పు..చివరకు

నెదర్లాండ్స్‌లో ఓ మహిళా పైలట్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. గాల్లో ఉండగా చిన్న విమానం పైకప్పు ఉన్నట్లుండి ఓపెన్ అయ్యింది. దాంతో.. ఆమె భయాకన అనుభవాన్ని చూసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సదురు మహిళ సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.

నెదర్లాండ్స్‌కు చెందిన నరైన్‌ మెల్కుమ్జాన్ అనే మహిళా పైలట్‌ తేలికపాటి విమానాన్ని టేకాఫ్ చేసింది. ఇక విమానం గాల్లోకిఎగిరే వరకు అంతా సవ్యంగానే ఉంది. ఆమె ఈ రైడ్‌ను వీడియో రికార్డు చేసింది. గాల్లో విమానం చక్కర్లు కొడుతున్న సమయంలో.. విమానం పైకప్పు ఒక్కసారిగా తెరుచుకుంది. అంతే ఆమె కంగారుపడిపోయింది. వేగంగా వీస్తున్న గాలితో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. కానీ.. ఇలాంటి భయానక పరిస్థితుల్లో కూడా కాసేపు ప్రయాణించి చివరకు సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేసింది. ఈ వీడియోను ఎక్స్‌ వేదిగా షేర్ చేసిన మెల్కుమ్జాన్.. కొన్ని సూచనలు చేసింది. ప్రయాణంలో ఎలాంటి నిర్లక్ష్యానికి చోటు ఇవ్వొద్దంటూ పైలట్లకు సూచనలు చేసింది.

ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆమె.. ‘విన్యాసాల శిక్షణలో భాగంగా విమానంతో అది నా రెండో ప్రయాణం. నేను ఎక్స్‌ట్రా 330 ఎల్‌ఎక్స్‌ విమానంలో గాల్లో ఉండగానే పైకప్పు తెరుచుకుంది. టేకాఫ్‌కు ముందు సరిగ్గా చూసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైంది. సరైన తనిఖీ చేసి ఉంటే అంతా సవ్యంగానే ఉండేది. కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోకుండానే శిక్షణకు వెళ్లడం కూడా నేను చేసిన మరో తప్పు. ఆ సమయంలో కళ్లద్దాలు కూడా లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. భారీ శబ్ధం.. వేగమైన గాలులు.. ఎటూ సరిగ్గా చూడలేక.. శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో కూడా విమానాన్ని నడిపించడం సవాల్‌గా మారింది. కిందకు దిగాక కంటిచూపు సమస్య వెంటాడింది. దాదాపు 28 గంటల పాటు కళ్లు ఇబ్బంది పెట్టాయి. ఇది నా లైఫ్‌లోనే అత్యంత భయానక పరిస్థితి". అని మెల్కుమ్జాన్ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఇది రెండేళ్ల క్రితం జరగ్గా ఆలస్యంఆ చెబుతున్నట్లు తెలిపింది. పైలట్లకు ఇది హెచ్చరికగా ఉంటుందని తాను భావిస్తున్నట్లు పేర్కొంది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఇంకొందరు ముందే చూసుకోవాలి నిజమే మీరు చెప్పింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియో షేర్ చేయడం వల్ల ఇతర పైలట్లకు సూచనగా ఉంటుందని.. ఆమెను అభినందిస్తున్నారు.

Next Story