కారులో వెళ్తూ అభిమానిని దారి అడిగిన ధోనీ..వైరల్ వీడియో

ఒక బైకర్‌ను ఆపి అడ్రస్‌ అడిగాడు మహేంద్రసింగ్‌ ధోని. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

By Srikanth Gundamalla  Published on  12 Aug 2023 5:15 AM GMT
MS Dhoni, ask route, Fans, Viral Video,

కారులో వెళ్తూ అభిమానిని దారి అడిగిన ధోనీ..వైరల్ వీడియో

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు వీరాభిమానులు ఉంటారు. కెప్టెన్‌ కూల్‌గా పేరు సంపాదించుకున్న ధోనీ.. అభిమానులతోనూ అలానే ఉంటారు. ఆయన ఆట తీరే కాకుండా.. ధోనీ సింప్లిసిటీనే అభిమానులను పెంచేసింది. ప్రస్తుతం ఐపీఎల్‌లోనే ఆడుతున్న మహేంద్రసింగ్ ధోనీ.. ఒక్కసారి కనిపిస్తే చాలు అంటూ స్టేడియాలకు వెళ్లడం చూశాం. ఆయన ఒక్క బంతి ఆడినా పండగే అంటూ అభిమానులు కేరింతలు కొట్టారు. ఐపీఎల్ సీజన్-2023 కప్‌ను కూడా ధోనీ కెప్టెన్‌గా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

మహేంద్ర సింగ్‌ ధోనీ కనిపిస్తే ఫొటోలు దిగుతుంటారు అభిమానులు. అదే ఒక వేళ ఆయన మన బైక్ పక్కన కారు ఆపి.. అడ్రస్‌ అడిగితే..! ఆ అభిమాని సంతోషమే వేరు కదా. అవును సేమ్‌ ఇలాంటి అనుభూతే పొందాడు ఒక అభిమాని. కారులో వెళ్తుండగా అడ్రస్‌ మర్చిపోయాడు ధోనీ. దాంతో.. అటుగా వెళ్తున్న ఒక బైకర్‌ను ఆపి అడ్రస్‌ అడిగి తన దారిన వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నేరుగా ధోనీనే బైకర్‌ను అడ్రస్ అడగడం అతడి అదృష్టం అంటూ కొందరు కామెంట్స్‌ పెడుతున్నారు.

వైరల్ అవుతోన్న వీడియోలో ఉన్నదాని ప్రకారం.. మహేంద్ర సింగ్ ధోనీ స్నేహితుడితో కలిసి కారులో బయటకు వచ్చాడు. ధోనీ స్నేహితుడే కారు నడుపుతున్నారు. మార్గ మధ్యలో వారికి దారి తెలియలేదు.. దాంతో అదే దారిలో వెళ్తున్న ఒక బైకర్‌ను ఆపాడు మహేంద్ర సింగ్ ధోనీ. తాను వెళ్లాల్సిన రూట్‌ గురించి అడిగాడు. అలా ముందుకు వెల్తే నాలుగు రోడ్ల సర్కిల్ వస్తుందని.. దాని దాటి ముందుకు వెళ్తే రాంచీ వస్తుందని అభిమాని చెప్పాడు. అలా ధోనీ రూట్ అడగ్గానే బైక్‌పై ఉన్న వ్యక్తులు ఫోన్ తీసి వీడియో తీశాడు. తమ అభిమాన క్రికెటర్‌ నేరుగా అడ్రస్‌ అడగడంతో సంతోషం వ్యక్తం చేశారు. బైకర్‌ రూట్‌ చెప్పగానే మహేంద్ర సింగ్‌ ధోనీ కూడా మాట్లాడాడు. అది విగ్రహం ఉన్న సర్కిలేనా అని అడిగాడు. దాంతో.. వారు అవునని సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఫ్యాన్‌తో సెల్ఫీ దిగిన ఎంఎస్‌ ధోనీ.. ముందుకు వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇదే వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story