గుడి హుండీలో చోరీకి యత్నించి దొరికిన దొంగ (వీడియో)

కామారెడ్డి జిల్లాలో కూడా ఓ వ్యక్తి హుండీలో డబ్బులు కొట్టేసేందుకు ప్రయత్నించాడు .

By Srikanth Gundamalla  Published on  3 April 2024 9:13 AM GMT
theft,  temple, hundi, kamareddy,

గుడి హుండీలో చోరీకి యత్నించి దొరికిన దొంగ (వీడియో)

కొందరు వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాళం వేసిన ఇళ్లు.. ఏటీఎంలు, బ్యాంకులు ఇవే కాదు.. రద్దీగా ఉండే చోట్లలో తమ చేతివాటం చూపిస్తారు. ఇక కొన్నిసార్లు పట్టుబడి కటకటాల పాలైతే.. దొరకని రోజు మాత్రం పండగ చేసుకుంటారు. అయితే.. కొందరు దొంగలు దేవుడి గుళ్లను కూడా వదలడం లేదు. హుండీల్లో ఉన్న డబ్బులపై కన్నేసి వాటిని కాజేస్తుంటారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో కూడా ఓ వ్యక్తి హుండీలో డబ్బులు కొట్టేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. చివరకు ఆ దేవతే అతన్ని పట్టించింది.

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో ఈ సంఘటన జరిగింది. స్థానికంగా ఉన్న మాసుపల్లి పోచమ్మ ఆలయంలో సురేశ్‌ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అయితే.. గుడిలో ఎవరూ లేని సమయంలో హుండీ దొంగతనానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. మంగళవారం రాత్రి వెళ్లి అనుకున్నట్లుగానే హుండీ పై భాగాన్ని ధ్వంసం చేశాడు. అందులో ఉన్న డబ్బులను చేత్తో తీసే యత్నించాడు. హుండీలో పెట్టిన చేతి వెనక్కి రాలేదు. అందులోనే ఇరుక్కుపోయింది. ఎంతో ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది.

దాంతో తప్పించుకునే మార్గం కనిపించలేదు. చేసేదేం లేక అక్కడే ఉండిపోయాడు. ఉదయం గుడికి వచ్చిన భక్తులు, పూజారి అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. చేతి హుండీలో ఇరుక్కుపోవడం చూసి దొంగతనానికి యత్నించాడని గ్రహించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఆ వ్యక్తి హుండీలో చోరీకి యత్నించి చేతి ఇరుక్కుపోవడంతో పట్టుబడ్డ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


Next Story