ఈ నెల 19న ఎయిరిండియా విమానాల్లో ఎక్కొద్దు.. ప్రాణాలకే ముప్పు: ఖలీస్థాన్

ఖలీస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ బెదిరింపులకు పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By Srikanth Gundamalla  Published on  5 Nov 2023 7:53 AM GMT
khalistani, pannun, warning, air india,

ఈ నెల 19న ఎయిరిండియా విమానాల్లో ఎక్కొద్దు.. ప్రాణాలకే ముప్పు: ఖలీస్థాన్

ఖలీస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ బెదిరింపులకు పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సిక్కులుఎవరూ నవంబర్‌ 19న ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని చెప్పారు. అంతేకాదు..వినకుండా ఎవరైనా అలా ప్రయాణం చేస్తే ప్రాణాలు ప్రమాదంలో పడతాయంటూ హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అమెరికాకు చెందిన వేర్పాటువాద గ్రూప్ సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకులలో పన్నూన్ ఒకరు.

నవంబర్‌ 19న ఎయిరిండియా విమానంలో ప్రయాణించవద్దని సిక్కు ప్రజలను కోరుతున్నామని వీడియోలో పన్నూన్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్త దిగ్బంధనం ఉంటుందని చెప్పారు. ఎయిరిండియాను ఆపరేట్‌ చేయడానికి అనుమతించరంటూ పన్నూన్ పేర్కొన్నారు. నవంబర్ 19న ఎయిరిండియా విమానాల్లో ప్రయాణం చేయొద్దని పేర్కొన్నారు. అలా కాకుండా ప్రయాణం చేసినట్లు అయితే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని వార్నింగ్ ఇచ్చారు. అదే రోజు నవంబర్ 19న వరల్డ్ టెర్రర్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది అని పన్నూన్ బెదిరించారు. సోషల్‌ మీడియాలోకి వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నవంబర్‌ 19న మూసివేయబడుతుందని వీడియోలో పన్నూన్ అన్నాడు. విమానాశ్రయం పేరును కూడా మార్చాలని పన్నూన్ ప్రతిపాదించారు. పంజాబ్ విముక్తి పొందినప్పుడు ఈ విమానాశ్రయం పేరును షాహిద్ బియాంత్ సింగ్, షాహిద్ సత్వంత్ సింగ్ ఖలిస్థాన్‌గా మారుస్తామని పన్నూన్ చెప్పాడు.

అతను ఇలాంటి బెదిరింపులకు పాల్పడటం ఇదే మొదటిసారి కాదు. గత సెప్టెంబరులో కెనడాలో హిందువులంతా ఆ దేశాన్ని విడిచివెళ్లాలని ప్రకటించాడు. ఇక, గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు 2020 జులైలో ఉగ్రవాదిగా భారత్ గుర్తించింది. భారతదేశాన్ని ముక్కలు చేయాలని ఎన్నో కుట్రలకు పాల్పడినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తు వెల్లడయ్యింది.

Next Story