ఇతనెవరండీ బాబూ..దాడి చేసిన చిరుతను బంధించి.. తర్వాత..

కర్ణాటకలో ఓ యువకుడు దాడి చేసిన చిరుతనే బంధించి అటవీశాఖ అధికారులకు అప్పగించాడు.

By Srikanth Gundamalla  Published on  16 July 2023 9:55 AM GMT
Karnataka, Man ties leopard, Forest Department

ఇతనెవరండీ బాబూ..దాడి చేసిన చిరుతను బంధించి.. తర్వాత..

చిరుత పులి అంటే ఎవరైనా భయపడతారు. జూలో చూస్తున్నంతసేపు ఓకే కానీ.. స్వేచ్ఛగా తిరుగుతున్నప్పుడు అంటే ఎవరికైనా భయమే. ఇక అదే చిరుత పులి దాడి చేయడానికి వస్తే.. గుండె ఆగిపోతుంది కదా..! అయితే.. ఓ కుర్రాడిపై కూడా ఓ చిరుత దాడి చేసింది. కానీ ఆ యువకుడు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాడి చేసిన చిరుత పులిని బంధించి.. అటవీ శాఖ అధికారులకు అప్పగించాడు. చిరుతను బంధించి.. ఆ తర్వాత దాన్ని బైక్‌పై తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

కర్ణాటక హాసన్‌ జిల్లాలోని అరసీకెరె తాలూకా గండాసి హొబ్లీ బాగివాలులో జరిగింది ఈ సంఘటన. వేణుగోపాల్‌ అనే యువకుడు ఉదయం వేళ పొలానికి బయల్దేరాడు. అలా వెళ్తుండగా దారి మధ్యలో అతనికి చిరుత ఎదురైంది. అంతే.. యువకుడిని చూసిన చిరుత పులి దాడికి పాల్పడింది. చిరుత దాడి చేస్తుండగా సదురు యువకుడు భయంతోనే.. బతకాలనే తపనతో తిరిగి పోరాడాడు. వీరోచిత పోరాటం తర్వాత.. చిరుత వెనక్కి తగ్గింది. అక్కడి నుంచి పారిపోతుండగా చిరుతను బంధించాడు. నాలుగు కాళ్లను కట్టేశాడు. తాడు కట్టేసి బంధించిన తర్వాత వీడియో తీయడం మొదలు పెట్టాడు. అయితే.. చిరుత దాడిలో వేణుగోపాల్‌కు స్వల్పగాయాలు అయ్యాయి.

అక్కడే వదిలేస్తే ఇంకెవరిపైనా అయినా దాడి చేయొచ్చు.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చిరుతను బంధించాడు యువకుడు. ఆ తర్వాత దాన్ని బైక్‌కు కట్టేసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. చిరుత ఆ సమయంలో స్పృహ కోల్పోయింది. చికిత్స అందించాలనే ఉద్దేశంతో.. బైక్‌పై కట్టేసి అటవీశాఖ అధికారుల వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత చిరుతకు చికిత్స చేయించారు. యువకుడు చిరుతను బంధించి, బైక్‌కు కట్టేసి తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వేణుగోపాల్‌ నిజమైన వీరుడు,ధైర్య సాహసి అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అంతేకాక.. ఇతరులకు చిరుత వల్ల హాని.. లేదంటే వేటగాళ్లు కూడా చిరుతను చంపే అవకాశం ఉంది కాబట్టి అతను అటవీశాఖ అధికారులకు చిరుతను అప్పగించడం పట్ల జంతు ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story