ఫుల్లుగా తాగి డ్యూటీ ఎక్కాడు..నడపలేనని బస్సుని వదిలేశాడు..
లోనే ఓ బస్సు డ్రైవర్ ఫుల్లుగా మద్యం సేవించి డ్యూటీ ఎక్కాడు.
By Srikanth Gundamalla Published on 21 Aug 2023 1:16 PM GMTఫుల్లుగా తాగి డ్యూటీ ఎక్కాడు..నడపలేనని బస్సుని వదిలేశాడు..
మద్యం సేవించి వాహనాలు నడపరాదు. ఎందుకంటే మద్యం మత్తులో ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. చాలా ఘటనలు జరిగాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వాలు కూడా ఫైన్లు విధిస్తూ ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ.. కొందరు మాత్రం చట్టాలు తమ చుట్టాలు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అయితే.. ఈ క్రమంలోనే ఓ బస్సు డ్రైవర్ ఫుల్లుగా మద్యం సేవించి డ్యూటీ ఎక్కాడు. ఆ తర్వాత కొంతదూరం బస్సును తీసుకెళ్లాడు. మధ్యలో ఏమైందో ఏమో.. బస్సును రోడ్డుపైనే నిలిపేసి ఇక తనవల్ల కాదంటూ పక్కకు జరిగాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న గోపాలకృష్ణ అనే వ్యక్తి డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సోమవారం ఉదయాన్నే అతనికి డ్యూటీ ఉంది. అయితే.. ఉదయాన్నే అతనికి మద్యం ఎక్కడ లభించిందో తెలియదు కానీ.. ఫుల్లుగా తాగేసి విధుల్లోకి వచ్చాడు. తర్వాత డిపోలో బస్సుని తీసుకుని ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. హెచ్‌డీ కోటె-మైసూరు సర్వీసును నడిస్తున్నాడు. మైసూరుకి చేరుకోక ముందే అతనికి ఉదయం తాగిన మందు పూర్తిగా ఎక్కింది. దాంతో.. బస్సును నడపలేనంటూ పక్కకు ఆపాడు. హ్యాండ్‌పోస్ట్ దగ్గరనే రోడ్డుపై బస్సు నిలిపి కిందకు దిగాడు.
ఆ తర్వాత ప్రయాణికులంతా బస్సు ఎందుకు నిలిపేశావంటూ డ్రైవర్‌ను నిలదీసి అడిగారు. దానికి అతను తాను ఉదయం విధులకు హాజరుకాక ముందే మద్యం సేవించానని చెప్పాడు. అతడి నిర్లక్ష్యపు సమాధానం విన్న ప్రయాణికులంతా షాక్ అయ్యారు. అప్పటికే బస్సులో దాదాపు 50 మంది వరకు ఉన్నారు. అంతమంది ప్రాణాలను పణంగా పెట్టి నిర్లక్ష్యంగా మద్యం తాగి వచ్చిన డ్రైవర్ గోపాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అయితే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇదే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సమాచారం తెలుసుకున్న కర్ణాటక ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే అతడి స్థానంలో మరో డ్రైవర్‌ను పంపించారు. ఆ తర్వాత ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. ఇక విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి మద్యం తాగి వచ్చిన గోపాలకృష్ణపై చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.