శాండ్‌విచ్‌లో స్క్రూ.. ఇండిగో విమానంలో ఘటన
విమానంలో శాండ్‌విచ్ తీసుకున్న ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 14 Feb 2024 11:30 AM ISTశాండ్‌విచ్‌లో స్క్రూ.. ఇండిగో విమానంలో ఘటన
విమాన ప్రయాణాలు అంటేనే చాలా కాస్ట్‌లీ ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టే సౌకర్యాలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. విమానాల్లో ప్రయాణికులకు కావాల్సిన ఆహారాన్ని కూడా విమానయాన సిబ్బంది అందిస్తుంటారు. ఈ క్రమంలోనే విమానంలో శాండ్‌విచ్ తీసుకున్న ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది.
ఇండిగో విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు తనకు విమాన సిబ్బంది ఇచ్చిన శాండ్‌విచ్‌లో స్క్రూ వచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తాను ఆ శాండ్‌విచ్ తినలేదనీ.. విమానం దిగాక తిందాని ప్యాక్ ఓపెన్ చేసి చూస్తే ఈ విషయాన్ని గుర్తించినట్లు పేర్కొన్నాడు. కాగా..ఈ ఘటనపై ఫిర్యాదు చేసే హక్కు లేదని సదురు ఎయిర్‌లైన్స్ సంస్థ అధికారులు చెప్పినట్లు సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో తాను ఏం చేయాలో చెప్పండంటూ నెటిజన్లను సలహా అడిగాడు. ఈ నెల 1న సదురు ప్రయాణికుడు బెంగళూరు నుంచి చెన్నైకి ఇండిగో విమానంలో వెళ్తుండగా ఈ అనుభవం ఎదురైందని వెల్లడించారు.
దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కంపెనీ సీఈవోకు నేరుగా ఫిర్యాదు చేయాలంటున్నారు. మరికొందరు అయితే లింక్డ్‌ఇన్ ద్వారా కంప్లైంట్ చేయాలంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేస్తే ఉపయోగం ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొందరు అయితే కోర్టుకు వెళ్లాలని చెబుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చివరకు ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందించింది. ప్రయాణికుడికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. అయితే.. సదురు ప్రయాణికుడు సకాలంలో ఫిర్యాదు చేయలేదని తెలిపింది. ప్రయాణికులకు అందించే సేవల్లో తాము పకడ్బందీగా ఉంటామని ఇండిగో ఎయిర్‌లైన్స్ పేర్కొంది.