ఇండిగో విమానంలో పనిచేయని ఏసీ..ప్రయాణికులకు టిష్యూలు పంపిణీ

ఇండిగో విమానంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏసీ పనిచేయకపోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  6 Aug 2023 12:22 PM IST
Indigo, Flight, AC Not Work,  viral Video,

ఇండిగో విమానంలో పనిచేయని ఏసీ..ప్రయాణికులకు టిష్యూలు పంపిణీ

ఇండిగో విమానంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏసీ పనిచేయకపోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సదురు విమాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీ ఆన్‌ అవ్వకముందే టేకాఫ్‌ చేశారని.. మళ్లీ ల్యాండింగ్‌ వరకూ ఏసీ ఆన్‌ చేయలేదని తెలుస్తోంది. అంతేకాక విమానంలో చిన్నపిల్లలు ఉండటంతో నానా ఇబ్బందులు పడ్డారు. అయితే.. ఉక్కపోతతో వచ్చిన చెమటలను తుడుచుకునేందుకు మాత్రం విమాన సిబ్బంది టిష్యూలు పంపిణీ చేశారు. వాళ్లలా టిష్యూలు ఇస్తుంటే వీడియో తీశారు. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

చండీగఢ్‌ నుంచి జైపూర్‌ వెళ్తున్న విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానంలో ఏసీలు పనిచేయలేదని.. ప్రయాణికులు ఎంతో ఇబ్బందులు పడ్డారని వీడియోను పంజాబ్ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు అమరీందర్‌సింగ్‌ రాజా సోషల్‌మీడియాలో పంచుకున్నారు. విమానంలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అయితే.. గాలి ఆడక వారు అట్టలతో గాలి ఊపుతూ గడిపారు. ప్రయాణం ఎప్పుడు అయిపోతుందా అన్నట్లుగా సీట్లోనే కూర్చుండిపోయారు.

విమాన ప్రయాణికులను ముందు మంటుడెంటలో సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు క్యూలో నిలబెట్టారని అమరీందర్‌సింగ్ తెలిపారు. ఆ తర్వాత ఏసీలు ఆన్‌ చేయకుండానే విమానం టేకాఫ్‌ తీసుకుందని చెప్పారు. ఇక టేకాఫ్‌ తీసుకున్నాక కూడా ఏసీలు ఆన్‌ చేయలేదని.. ల్యాండింగ్‌ జరిగే వరకూ తీవ్ర ఇబ్బందులు పడ్డామని అమరీందర్‌సింగ్‌ ట్విట్టర్‌లో తెలిపారు. ఏసీలు పనిచేయకపోవడంపై విమాన సిబ్బంది ఎలాంటి ప్రకటన చేయలేదని.. ఆ తర్వాత కూడా ఏ విధంగానూ స్పందించలేదని చెప్పారు. చెమటలు తుడుచుకోండి అంటూ టిష్యూలు మాత్రం అందించారని అమరీందర్‌సింగ్ చెప్పారు. ఏసీ లేకుండా విమానంలో కూర్చోవడం వల్ల ప్రయాణికులు చెమటలు కక్కారని.. తీవ్ర ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. విమానం ఉన్న 90 నిమిషాల పాటు ఇదే పరిస్థితి కొనసాగిందని అమరీందర్‌సింగ్ పేర్కొన్నారు.

వీడియోను డీజీసీఏ, సహా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాకు ట్యాగ్‌ చేశారు అమరీందర్ సింగ్. ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే.. ఇదొక్కటే కాదు.. ఒకే రోజులో మూడు విమానాల్లో సాంకేతిక సమస్యలు నెలకొన్నాయి. అవన్నీ కూడా ఇండిగో విమానాలే కావడం గమనర్హం. ఢిల్లీ నుంచి పాట్నా బయల్దేరిన విమానం సాంకేతిక లోపంతో మూడు నిమిషాల్లోనే అత్యవసరంగా వెనక్కి వెళ్లి ల్యాండ్ అయ్యింది. మరో విమానం ఢిల్లీ నుంచి రాంచీ బయల్దేరిన కాసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించారు. ఆ విమానాన్ని కూడా అధికారులు వెనక్కి మళ్లించారు.

Next Story