బుల్లెట్ బండిపై ఎయిర్‌పోర్టుకు సీఎం.. వీడియో వైరల్

హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌. సాధారణ పౌరుడిలా బైక్‌పై ప్రయాణం చేశారు.

By Srikanth Gundamalla  Published on  26 Sep 2023 9:22 AM GMT
Haryana CM, Manoharlal Khattar,  Bullet bike, viral video,

బుల్లెట్ బండిపై ఎయిర్‌పోర్టుకు సీఎం.. వీడియో వైరల్

ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారికి భద్రత పటిష్టంగా ఉంటుంది. ఎవరైనా కలవాలన్నా.. ముఖ్యమంత్రే బయటకు వెళ్లాలన్నా పక్కన సెక్యూరిటీ కచ్చితంగా ఉంటుంది. బయటకు వెళ్లే సమయంలో భద్రతా సిబ్బందితో పాటు.. అనుచరులు, కార్యకర్తల సందడి ఎక్కువగానే ఉంటుంది. ముందు పది కార్లు.. వెనుక పది కార్లు వెళ్తూ ఉంటాయి. అయితే.. దీనికి భిన్నంగా వ్యవహరించారు హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌. సాధారణ పౌరుడిలా బైక్‌పై ప్రయాణం చేశారు. బుల్లెట్‌ బండిపైనే ఎయిర్‌పోర్టు వరకు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ సాధారణ వ్యక్తిలాగానే హెల్మెట్ ధరించి రోడ్డుపైకి బుల్లెట్‌పైన వచ్చారు. ఆ తర్వాత రోడ్డుపై చక్కర్లు కొడుతూ.. దర్జాగా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. స్వయంగా సీఎం ఖట్టర్ బుల్లెట్‌ బైక్‌ నడుపడం అందరినీ ఆకర్షించింది. ఆయన అలా బుల్లెట్‌ బండిపై వెళ్తుంటే వెనకాలే సిబ్బంది కూడా ఇతర బైక్‌లపై ఫాలో చేశారు. అయితే.. ఖాళీ రోడ్లపై ఆయనలా బైక్‌పై తిరిగిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి. నెటిజన్లు, ఆయన అనుచరులు వీడియోకు లైక్స్‌ కొడుతూ షేర్ చేస్తున్నారు.

హర్యానా సీఎం అలా బుల్లెట్‌ బండిపై ఎయిర్‌పోర్టుకి వెళ్లడం వెనుక కారణం లేకపోలేదు. కార్‌ఫ్రీ డే కార్యక్రమం హర్యానాలో నిర్వహించారు. ఈ సందర్భంగానే సీఎం కూడా కారులో కాకుండా బైక్‌పై ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. కార్‌ ఫ్రీ డే అయినా.. డ్రగ్స్‌ ఫ్రీ హర్యానాగా మార్చాలనే సంకల్పం అయినా.. ప్రజల సహకారం లేకుండా జరగదని సీఎం ఖట్టర్ అన్నారు. రోడ్లపై ట్రాఫిక్‌ను తగ్గించడం కోసం కార్‌ ఫ్రీ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. ఇందులో భాగంగానే తాను కూడా బైక్‌పై కర్నాల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లానని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు కూడా ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు తమ వంతుగా భాగస్వామ్యం అందించాలని.. ఒక్కరోజు కార్లను ఉపయోగించకూడదని ఆశిస్తున్టన్లు ఎక్స్ (ట్విట్టర్‌ )ద్వారా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తెలిపారు.

Next Story