Video: చిన్నారిని కాపాడిన హీరోయిన్ సోదరి.. నెటిజన్ల ప్రశంసలు
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని సోదరి ఖుష్బూ చేసిన పని నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
By అంజి
Video: చిన్నారిని కాపాడిన హీరోయిన్ సోదరి.. నెటిజన్ల ప్రశంసలు
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని సోదరి ఖుష్బూ చేసిన పని నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. ఉత్తరప్రదేశ్ బరేలిలోని ఇంటి సమీపంలో ఖుష్బూ వాకింగ్ చేస్తుండగా.. ఆమెకు ఓ చిన్నారి ఏడుపు వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్లిన నటి సోదరి, మాజీ భారత ఆర్మీ అధికారిణి.. ఆ చిన్నారిని రక్షించారు. చిన్నారిని వదిలి వెళ్లిన వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఖుష్బూ.. ఆ చిన్నారిని ఎవరో తమ ఇంటి వెనుక వదిలి వెళ్లారని, ఆమె అక్కడ మట్టిలో పడి ఉందని తెలియజేసింది. ఆ చిన్నారికి మంచి పెంపకం, తగిన ఇల్లు ఏర్పాటు చేస్తానని ఆమె తన అనుచరులకు హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని మరింత దర్యాప్తు చేయడానికి ఒక పోలీసు అధికారి ఆ చిన్నారిని తీసుకెళ్లడం కూడా వీడియోలో కనిపించింది.
చిన్నారిని కనుగొన్న తర్వాత, ఆమె వెంటనే శిశువును ఇంటికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత చిన్నారిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ చికిత్స కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఖుష్బూ చేసిన పనిపై దిశాతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సర్కిల్ ఆఫీసర్ (సిటీ-I) పంకజ్ శ్రీవాస్తవ ప్రకారం.. ఖుష్బూ ఉదయం నడకకు వెళ్ళినప్పుడు సమీపంలోని ఒక పాడుబడిన భవనం నుండి శిశువు ఏడుపు విన్నది. ఆ నిర్మాణానికి నేరుగా ప్రవేశం లేదు, కాబట్టి ఆమె ధైర్యంగా గోడ ఎక్కి ఆ ప్రదేశానికి చేరుకుంది. లోపల, ఆమె నేలపై పడి ఏడుస్తున్న శిశువును, ముఖంపై కనిపించే గాయాలను చూసింది" అని శ్రీవాస్తవ చెప్పారు.
చిన్నారిని ఎవరు వదిలేశారో గుర్తించడానికి పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను తనిఖీ చేయడం ప్రారంభించారు. ఖుష్బూ, దిశా తమ కుటుంబంతో బరేలీలో పెరిగారు. ఖుష్బూ ఆర్మీకి వెళ్ళగా, దిశా మోడలింగ్‌ను ఎంచుకుని సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ సోదరీమణులు తరచుగా కలిసి ప్రయాణిస్తూ, వారి కెరీర్‌లను ఉత్తమంగా మలచుకుంటూ కనిపిస్తారు.
మరోవైపు, దిశా తదుపరి అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రవీనా టాండన్, సంజయ్ దత్, సునీల్ శెట్టిలతో పాటు 'వెల్‌కమ్ టు ది జంగిల్'లో కనిపించనుంది. ఈ సంవత్సరం చివర్లో ఈ చిత్రం తెరపైకి వచ్చే అవకాశం ఉంది.