Video: ఇలాగేనా నిద్ర లేపేది?.. పోలీసు అధికారిపై విమర్శలు

మహారాష్ట్రలోని పుణె రైల్వే స్టేషన్‌లో ఓ పోలీసు అధికారి చేసిన నిర్వాకంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

By అంజి  Published on  2 July 2023 4:18 AM GMT
Pune news, Pune Railway Station, Government Railway Police

Video: ఇలాగేనా నిద్ర లేపేది?.. పోలీసు అధికారిపై విమర్శలు

మహారాష్ట్రలోని పుణె రైల్వే స్టేషన్‌లో ఓ పోలీసు అధికారి చేసిన నిర్వాకంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పూణేలోని రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై నిద్రిస్తున్న వారిపై ఓ పోలీసు నీళ్లు పోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఆ పోలీసు అధికారి మానవత్వం మరిచి ఈ విధంగా ప్రవర్తించాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 'రిప్‌ హ్యుమానిటీ.. పుణె రైల్వే స్టేషన్‌ ' అని క్యాప్షన్‌ ఇచ్చి వీడియోను రూపన్ చౌదరి అనే నెటిజన్‌ శుక్రవారం ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు 15 వేలకుపైగా లైక్‌లు రాగా 42 లక్షల మంది వీక్షించారు.

ఈ వీడియో పూణే డివిజనల్ రైల్వే మేనేజర్ ఇందు దూబేకు కూడా చేరింది. ఈ ఘటన తీవ్ర విచారకరమని ఆమె పేర్కొన్నారు. "ప్లాట్‌ఫారమ్‌పై పడుకోవడం ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది, అయితే దానిని నిర్వహించే విధానం ప్రయాణీకులకు కౌన్సెలింగ్ చేయడానికి సరైన మార్గం కాదు" అని వీడియోపై స్పందించిన దూబే అన్నారు. "ప్రయాణికులతో గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలని సంబంధిత సిబ్బందికి తగిన విధంగా సూచించారు. ఈ సంఘటనకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను" అని ఆమె తెలిపారు.

ఈ వీడియోలో నిద్రిస్తున్న వారిని హ్యాండిల్ చేసిన తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అయితే, కొందరు వినియోగదారులు కూడా పోలీసుల పక్షాన నిలిచారు. "ప్రభుత్వం మరిన్ని నిరీక్షణ ప్రాంతాలను ఏర్పాటు చేయాలి, తద్వారా వారు ప్లాట్‌ఫారమ్‌లపై నిద్రించాల్సిన అవసరం లేదు, రైళ్లు సమయానికి వెళ్లాలి" అని ఒక వినియోగదారు సూచించారు. "తన డ్యూటీని చాలా సృజనాత్మకంగా నిర్వర్తించినందుకు ఈ పోలీసుకు సెల్యూట్ చేయండి. ప్లాట్‌ఫారమ్‌లు, మెట్లు మొదలైన వాటిపై ప్రజలు నిద్రపోవడం ప్రారంభిస్తే, హడావిడిగా ఉన్న ప్రయాణికులు ఎలా వెళతారో ఊహించండి" అని మరొక వినియోగదారు రాశారు.

Next Story