విద్యార్థినుల టాయిలెట్స్‌లో కెమెరాలు..ప్రిన్సిపాల్‌కు దేహశుద్ధి

భజరంగ్‌దళ్‌ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపాల్‌కు దేహశుద్ధి చేశారు.

By Srikanth Gundamalla  Published on  6 July 2023 9:11 PM IST
CCTV Camera, Girl Student, Bathroom, Principal, Viral Video,

విద్యార్థినుల టాయిలెట్స్‌లో కెమెరాలు..ప్రిన్సిపాల్‌కు దేహశుద్ధి

విద్యాబుద్దులు నేర్పించాల్సిన టీచర్లే తప్పుడు దారులు తొక్కుతున్నారు. జీవితంలో ఒక దారి చూపించాల్సిన వారే.. విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. మహారాష్ట్రలో ఓ స్కూల్ ప్రిన్సిపాల్‌ కూడా ఇలానే చేశాడు. విద్యార్థినుల మరుగుదొడ్లలో సీసీ కెమెరాలు అమర్చాడు. అంతేకాదు.. పరమత ప్రార్థనలు చేయాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెచ్చాడు. విద్యార్థులు ఇదే విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రిన్సిపాల్‌ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు పేరెంట్స్. ఈ విషయాన్ని భజరంగ్‌దళ్‌ సభ్యలకు కూడా చేరవేశారు. ఆ తర్వాత భజరంగ్‌దళ్‌ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపాల్‌కు దేహశుద్ధి చేశారు. పరిగెత్తించి కొట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

పుణెలోని డీవై పాటిల్ హైస్కూల్‌లో జరిగింది ఈ ఘటన. అంబి గ్రామంలోని డీవై పాటిల్‌ స్కూల్‌లో అలెగ్జాండర్ కోట్స్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. స్కూల్‌కు వెళ్లే విద్యార్థులను రోజూ అన్యమత ప్రార్థనలు చేయాలని ఒత్తిడి చేశాడు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులకు కంప్లైంట్‌ చేశారు. తల్లిదండ్రులు వెళ్లి ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. ఇలాంటి చేయించొద్దని హెచ్చరించారు. ఆ తర్వాత కూడా ప్రిన్సిపాల్‌ తన తీరు మార్చుకోలేదు. అన్యమత ప్రార్థనలు చేయాలని ఒత్తిడి పెంచాడు. దీంతో.. తల్లిదండ్రులు భజరంగ్‌దళ్ సభ్యులకు విషయం చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు, భజరంగ్‌దళ్‌ సభ్యులు స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపాల్‌కు దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఇదే వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అన్యమత ప్రార్థనలు చేయాలని ఒత్తిడి చేయడంతో పాటు.. విద్యార్థునుల బాత్రూముల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టాడని విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే.. బాత్రుముల్లో సీక్రెట్‌ కెమెరాలు ఏర్పాటు చేసింది వాస్తవమేనని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

Next Story