Telangana: ఆర్టీసీ బస్సులో కండక్టర్‌ చేతివాటం

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది.

By Srikanth Gundamalla  Published on  24 Dec 2023 10:24 AM GMT
bus conductor,  extra zero tickets, viralvideo, telangana,

Telangana: ఆర్టీసీ బస్సులో కండక్టర్‌ చేతివాటం

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది. తెలంగాణ స్థానికతతో గుర్తింపు కార్డు చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అయితే.. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆదరణ వస్తోన్న విషయం తెలిసిందే. దాంతో.. బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని రూట్లలో బస్సులు తక్కువగా ఉండటం ద్వారా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలోనే ఆర్టీసీ సంస్థ బస్సుల సంఖ్యను పెంచి.. ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది.

ఈ క్రమంలో ఆర్టీసీ కండర్లు తమ చేతివాటం చూపిస్తున్నారు. మహిళలకు ఫ్రీ జర్నీ టికెట్‌ కావడంతో.. మహిళా ప్రయాణికులు లేకపోయినా జీరో టికెట్లు కొడుతున్నాడు ఓ కండక్టర్‌. కండక్టర్‌ సీట్లోనే కూర్చొని జీరో టికెట్‌లు కొడుతూనే ఉన్నాడు. అదే బస్సులో ఉన్న ఒకరు ఈ వీడియోను రికార్డు చేశారు. తర్వాత సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

మహబూబ్‌నగర్‌ నుంచి తాండూరు వెళ్తున్న బస్సులో ఈ సంఘటన జరిగింది. టీఎస్‌34టీఏ5189 బస్సులో కండక్టర్‌ గండీడ్‌, జానంపల్లి స్టేజీల వద్ద మహిళా ప్రయాణికులు ఎక్కకపోయినా జీరో టికెట్లు ప్రింట్ చేస్తున్నాడు. వంద శాతం ఆక్యుపెన్సీ రేషియో పెంచడం కోసం మహిళా ప్రయాణికులు ఎక్కిన దానికంటే ఎక్కువ జీరో టికెట్లను కండక్టర్‌ ప్రింట్ చేశాడు. ఇక స్టేజీ దాటగానే ప్రింట్‌ చేసిన టికెట్లను బయటకు విసిరేసినట్లు తెలుస్తోంది. ఓ ప్రయాణికుడు ఇదంతా గమనించి తతంగాన్నంతా ఫోన్లో వీడియో రికార్డు చేశాడు. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆర్టీసీ ప్రయాణికులు సదురు కండక్టర్‌ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Next Story