దాడి చేసిన పులిని ఐక్యంగా పొడిచి చంపిన గేదెలు (వీడియో)

దాడి చేసేందుకు వచ్చిన పులిని ఐక్యంగా ఎదుర్కొని కొమ్ములతో పొడిచి చంపిన గేదెలు.

By Srikanth Gundamalla  Published on  22 July 2023 8:00 AM IST
buffaloes, attacked, killed tiger, Madhyapradesh,

దాడి చేసిన పులిని ఐక్యంగా పొడిచి చంపిన గేదెలు (వీడియో)

పులిని చూస్తే మనషులే కాదు.. ఏ జంతువైనా భయపడిపోతుంది. గుంపులుగా ఉన్నా కూడా పులిని చూస్తే చెల్లాచెదురై పారిపోతాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తాయి. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దాడి చేసేందుకు వచ్చిన పులిని ఐక్యంగా అడ్డుకున్నాయి గేదెల గుంపు. కొమ్ములతో పొడిచి తీవ్రంగా గాయపరిచాయి. ఆ తర్వాత పులి ప్రాణాలు కోల్పోయింది. అయితే.. పులిని ఎదుర్కొన్న గేదెల వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

గేదెలు, ఆవులపై పులి దాడి చేయడం సాధారణమే. కానీ గేదెలు పులిపై మూకుమ్మడిగా దాడి చేసి చంపేశాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ప్రాంతంలో కొంతకాలంగా పులి సంచరిస్తోంది. కంటికి కనిపించిన జంతువులపై దాడి చేసి చంపి తినిస్తోంది. పశువులను మేపేందుకు వెళ్తున్న వారిపైనా దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే చిరుత భయంతో ఈ ప్రాంత ప్రజలంతా భయపడిపోయారు. ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇక అడవిలో పశువులను మేపేందుక వెళ్లిన వారి అయితే వణికిపోతున్న పరిస్థితులు.

ఈ నెల 20న ఎస్‌గావ్‌ గ్రామ పరిసరాల్లో ఓ పశువుల కాపరిపై దాడికి ప్రయత్నించింది పులి. అయితే.. అతను తన చేతిలో ఉన్న గొడ్డలితో ఎదురు దాడి చేయడంతో పులి వెనక్కి తగ్గింది. అలా పశువుల కాపారి ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటికే ఆకలితో ఉన్న పులి తర్వాత బెంబాడా గ్రామంలోని అటవీ పరిసరాల్లో మేత మేస్తున్న ఆవులు, గేదెల మంద దగ్గరకు వెళ్లింది. ఆహారం దొరికింది కదా అనుకుని దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో గేదెలు భయపడి పరిగెత్తి చెల్లాచెదురు అవ్వకుండా.. ఐక్యంగా నిలబడ్డాయి. పులి దాడిని ఎదుర్కొన్నాయి. ఐక్యమత్యంగా పులిని కొమ్ములతో పొడిచాయి. దాంతో పులి తీవ్రంగా గాయాలపాలు అయ్యింది. అక్కడే ఉన్న పశువుల కాపరులు ఈ దృశ్యాలను సెల్‌ఫోన్లో బంధించారు. ప్రస్తుతం ఇదే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా.. తీవ్రంగా గాయపడ్డ పులిని అటవీశాఖ అధికారులు చంద్రపూర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి పులి చనిపోయిందని అధికారులు ప్రకటించారు.

Next Story