Video: చిరుతపులిని పట్టుకునేందుకు.. దోమ తెరతో పొలాల్లోకి బీజేపీ నేత

మధ్యప్రదేశ్‌లోని రేవాలో పంట పొలాల్లో చిరుతు పులి తిరుగుతూ పలువురిపై దాడి చేసింది. అయితే అధికారులు చిరుతపులిని బంధించడంలో విఫలమయ్యారు.

By అంజి  Published on  31 Dec 2024 12:00 PM IST
BJP leader, leopard, mosquito net, viral

Video: చిరుతపులిని పట్టుకునేందుకు.. దోమ తెరతో పొలాల్లోకి బీజేపీ నేత 

మధ్యప్రదేశ్‌లోని రేవాలో పంట పొలాల్లో చిరుతు పులి తిరుగుతూ పలువురిపై దాడి చేసింది. అయితే అధికారులు చిరుతపులిని బంధించడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీ నాయకుడు.. అధికారులపై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా చిరుత దాడులపై నిరాశ వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే శ్యామ్‌లాల్ ద్వివేది చిరుతపులిని దోమతెరతో నిరాయుధంగా పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు.

ద్వివేది, కొంతమంది వ్యక్తులు దోమతెర పట్టుకొని చిరుతపులి కనిపించిన పొలాల వైపు నడిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గత కొద్దిరోజులుగా ఐదుగురిపై దాడి జరిగిందని, అందులో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉందని ద్వివేది చెప్పారు. ''వీరిలో నలుగురు మధ్యప్రదేశ్‌కు చెందినవారు, ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. ఒక గేదెపై కూడా చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని, దాడి నుంచి ప్రజలను రక్షించాలని జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చాం'' అని శ్యామ్‌లాల్‌ ద్వివేది అన్నారు.

చిరుతపులి దాడి చేస్తుందన్న భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారని మాజీ ఎమ్మెల్యే అన్నారు. చిరుత పులిని పట్టుకునేందుకు అవసరమైతే ఆ ప్రాంతంలో క్యాంపు చేస్తానని కూడా చెప్పాడు. ప్రజల మనోధైర్యాన్ని పెంపొందించేందుకే తాను ఇక్కడకు వచ్చానన్నారు. ''చిరుతపులి దాడులపై కలెక్టర్‌తోనూ, పోలీసు ఉన్నతాధికారులతోనూ మాట్లాడాను. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నాను''అని ద్వివేది చెప్పారు.

గత మూడు రోజులుగా.. పోలీసులు, అటవీ అధికారులు చిరుతపులి జాడ కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు, కానీ అది సాధ్యం కాకపోవడంతో ద్వివేది అలాంటి చర్య తీసుకున్నారు.

Next Story