బైక‌ర్‌ను చిత‌క్కొట్టిన ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్‌.. వీడియో వైర‌ల్‌

Bengaluru bus driver mercilessly beats up biker. బ‌స్సు డ్రైవ‌ర్ బ‌స్సులో ఓ వ్య‌క్తిని విచ‌క్ష‌ణార‌హితంగా కొడుతున్న ఓ వీడియో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Nov 2022 4:34 AM GMT
బైక‌ర్‌ను చిత‌క్కొట్టిన ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్‌.. వీడియో వైర‌ల్‌

క‌ర్ణాట‌క రాష్ట్రంలోని బెంగ‌ళూరులో బ‌స్సు డ్రైవ‌ర్ బ‌స్సులో ఓ వ్య‌క్తిని విచ‌క్ష‌ణార‌హితంగా కొడుతున్న ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. యెలహంకలో బెంగళూరు ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (BMTC)కు చెందిన రెండు బస్సులు రోడ్డుపై వెలుతున్నాయి. ఒక బ‌స్సు మ‌రో బ‌స్సును ఓవ‌ర్ టేక్ చేస్తుండ‌గా త‌న భార్య‌తో క‌లిసి సందీప్‌(44) అనే వ్య‌క్తి బైక్‌పై ఎదురుగా వ‌చ్చాడు. దీంతో డ్రైవ‌ర్ స‌డెన్ బ్రేక్ వేశాడు. వెంట‌నే స్పందించిన సందీప్.. డ్రైవ‌ర్ వైపు కోపంగా చూసి త‌న మ‌ధ్య వేలుని చూపిస్తూ.. బ‌స్సును స‌రిగ్గా న‌డ‌పాల‌ని బ‌స్సులోకి ఎక్కి వార్నింగ్ ఇవ్వ‌బోయాడు.

ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలో బ‌స్సు డ్రైవ‌ర్ సందీప్‌పై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశాడు. సందీప్‌పై పిడిగుద్దుల వ‌ర్షం కురిపించాడు. డ్రైవ‌ర్ దాడిలో సందీప్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. బ‌స్సులో ఉన్న ప్ర‌యాణీకులు ఆపేందుకు య‌త్నించినా డ్రైవ‌ర్ ఆగ‌లేదు. ఈ త‌తంతాన్ని కొంద‌రు ప్ర‌యాణీకులు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది.

బీఎంటీసీ అధికారులు ఆ బ‌స్సు డ్రైవ‌ర్‌ను స‌స్పెండ్ చేశారు. ఇరు వ‌ర్గాల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story