ఒళ్లు జలదరించే వీడియో..లారీ కింద పడబోయిన బైక్‌.. జస్ట్‌మిస్

ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివారం పెనుప్రమాదం చోటుచేసుకుంది. ఒళ్లు జలదరించేలా ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

By Srikanth Gundamalla  Published on  7 Aug 2023 11:05 AM IST
Adilabad, Lorry Accident, Highway, Viral Video,

ఒళ్లు జలదరించే వీడియో..లారీ కింద పడబోయిన బైక్‌.. జస్ట్‌మిస్

రహదారులపై వెళ్లేటప్పుడు రోడ్డు నియమాలను పాటించాలి. ఇక అతివేగం ఎప్పుడూ ప్రమాదకరమే. కొంచెం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలను తీస్తుంది. ఇప్పటికే రోడ్డుప్రమాదాల్లో రోజూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గాయపడేవారి సంఖ్య అయితే ఎక్కువగానే ఉంటుంది. అయితే.. ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివారం పెనుప్రమాదం చోటుచేసుకుంది. ఒళ్లు జలదరించేలా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. వేగంగా వస్తోన్న లారీ రోడ్‌ క్రాస్‌ చేస్తోన్న బైక్‌ను ఢీకొట్టబోయింది. కానీ డ్రైవర్ అప్రమత్తతో ప్రాణనష్టం జరగలేదు.

ఆదిలాబాద్‌ జిల్లాలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మావల-గుడిహత్నూర్‌ మండలాల మధ్య 44వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వాహనాలు రద్దీగా ఉన్నాయి. ఎక్కువగా లారీలు తిరుగుతున్నాయి. హైవే కావడంతో వేగంగానే వెళ్తున్నాయి. అప్పుడే ఒక బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు రోడ్డు క్రాస్‌ చేసేందుకు ప్రయత్నం చేశారు. నేరడిగొండ మండలం చించచోలికి చెందిన జంగు, కృష్ణ, సంతోష్‌ మావల వాఘాపూర్‌లో అంత్య్రక్రియలకు వెళ్లి తిరుగు పయనం అయ్యారు. సీతాగోంది దగ్గర బైక్‌ను హైవే రోడ్డు దాటించేందుకు చూశారు. అయితే.. హైదరాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌ వైపు వెళ్తున్న కంటెయినర్‌ వేగంగా దూసుకొచ్చింది.

హైవేపై వేగంగా వస్తున్న లారీని చూసుకోలేదు కాబోలు.. నడిరోడ్డు మధ్యకు వచ్చేశారు. ఇక అప్పటికే వారిని గమనించిన లారీ డ్రైవర్‌ ప్రమాదాన్ని తప్పించేందుకు లారీని పక్కకు తిప్పాడు. దాంతో.. లారీ డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. పెద్ద శబ్ధంతో లారీ కిందపడిపోయింది. బైక్‌ చివరి క్షణంలో లారీ పక్క భాగంలో చివరన తగిలి కింద పడిపోయింది. బైక్‌పై ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా రోడ్డుపై పడిపోయారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీలో ఉన్న డ్రైవర్‌ సహా క్లీనర్‌కు స్వల్పగాయాలు అయ్యాయి, డ్రైవర్‌ రషీద్‌ ఖాన్‌, క్లీనర్‌ ఆబిద్‌ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. లారీ రోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్ ఏర్పడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. హైవేలపై వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. బైక్‌పై వెళ్తున్న ముగ్గురికీ ఇంకా భూమిపైనా నూకలు ఉన్నాయంటూ ఇంకొందరు అంటున్నారు. ఇక లారీని రోడ్డుపై నుంచి తొలగించాక.. ప్రస్తుతం వాహనరాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

Next Story