Fact Check : మొదటిసారిగా ముస్లిం మహిళను మహారాష్ట్ర ఎస్పీగా నియమించారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Sep 2020 7:47 AM GMT
Fact Check : మొదటిసారిగా ముస్లిం మహిళను మహారాష్ట్ర ఎస్పీగా నియమించారా..?

ఉర్దూ మీడియంలో చదువుకున్న మహిళను మహారాష్ట్ర ఎస్పీగా నియమించారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆమె అధికారిక పోలీసు డ్రెస్ ను వేసుకోవడం లేదని ముస్లింలు ధరించే హిజాబ్ ను వేసుకుందని చెబుతూ పోస్టులు పెడుతూ ఉన్నారు.

మహారాష్ట్రకు మొదటిసారిగా ముస్లిం మహిళను ఎస్పీగా నియమించారంటూ పోస్టులు పెడుతున్నారు.

M1

ఈ ఫోటో విషయంలో నిజా నిజాలు తెలియజేయాలని న్యూస్ మీటర్ కు వాట్సప్ లో రిక్వెస్ట్ వచ్చింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను చూడొచ్చు..!

నిజ నిర్ధారణ:

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టు 'పచ్చి అబద్ధం'.

న్యూస్ మీటర్ ఈ ఫోటోపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. అదే ఫోటోను ఫేస్ బుక్ లో మార్చి 5, 2020న పోస్టు చేశారు. ఆ పోస్టు ప్రకారం ఆ ముస్లిం అమ్మాయి మహారాష్ట్ర సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా ఒక్కరోజు పాటూ నియమించారు. మలక్ పూర్ ఉర్దూ హైస్కూల్ లో ఆ అమ్మాయి చదువుకుంటూ ఉంది.

ఆ ఫేస్ బుక్ పోస్టు సమాచారం ప్రకారం కీ వర్డ్స్ ను ఉపయోగించి చూడగా Deshdoot అనే మరాఠీ న్యూస్ పేపర్ కు సంబంధించిన వెబ్ సైట్ లో అమ్మాయికి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు. ఆమెను ఒక్కరోజు డీఎస్పీగా నియమానించారు. బుల్దానా కమిషనరేట్ లో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ అమ్మాయిని ఒక్కరోజు డీఎస్పీగా నియమించారు.

Navbharat Times, Mumbai Times మీడియా సంస్థలు యూట్యూబ్ లో వీడియోను అప్లోడ్ చేశాయి. బుల్దానా కమిషనరేట్ లో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ అమ్మాయిని ఒక్కరోజు డీఎస్పీగా నియమించారని ధృవీకరించాయి. బుల్దానా కలెక్టర్ సుమన్ చంద్ర ఆదేశాల ప్రకారం ఈ నియామకం చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

వైరల్ అవుతున్న ఫోటోకు.. వీడియోకు సంబంధించిన స్టిల్స్ ను గమనిస్తే మీకు అర్థం అయిపోతుంది.

M2

బుల్దానా పోలీసులు కూడా మార్చి 4వ తేదీన ఇదే ఫోటోను ట్వీట్ చేశారు. 'నేను కూడా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కావాలని అనుకుంటూ ఉన్నాను. ఈరోజు నా లైఫ్ లో చాలా ముఖ్యమైన రోజు.' అంటూ ఒక్కరోజు డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న సహరిల్ కవాల్ అనే బాలిక తెలిపింది. బుల్దానా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు డాక్టర్ దిలీప్ పాటిల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కారణంగా ఆ జిల్లాలో అమ్మాయిలను ఒక్కరోజు డీఎస్పీ, ఎస్పీ, కలెక్టర్ గానే కాదు.. పలు హోదాలలో నియమించారు. వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్నది తొమ్మిదో తరగతి చదువుతున్న అమ్మాయి.

ముస్లిం మహిళను మహారాష్ట్ర ఎస్పీగా నియమించారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

Next Story