హృదయాలను తాకే చిత్రమిది
By సుభాష్
మృత్యువు ఎటు వైపు నుంచి వెంటాడుతుందో ఎవ్వరికి తెలియదు. మనుషులకే కాదు.. జంతువులకు కూడా చావు ఎప్పుడు వెంటాడుతుందో తెలియని పరిస్థితి. కొన్ని కొన్ని ఘోరాలకు సంబంధించిన చిత్రాలు చూస్తుంటే హృదయం ద్రవించకమానదు. అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చూస్తుంటే హృదయం చలించి పోతుంటుంది. ప్రపంచంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నప్పటికీ కొన్ని మన హృదయానికి తాకుతుంటుంది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ హిల్స్ లో తీసిన ఓ చిత్రమే ఇందుకు నిదర్శనం.
గతంలో అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు రగిలినప్పుడు లక్షలాది చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. వేలాది జంతువులు ఈ అగ్నికిలలో మరణించాయి. దీని తర్వాత కాలిఫోర్నియలో మంటలు చెలరేగాయి. ఈ కారణంగా అమెరికాలో ఎప్పుడు లేనంతగా కాలుష్యం పెరిగిపోయింది. స్టార్స్ ఇష్టపడి నిర్మించుకున్న ఇల్లు ధ్వంసమయ్యాయి. వన్యప్రాణులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పరుగులు పెట్టాయి. ఇలా పరుగులు తీసిన జంతువులు చివరకు అగ్నికి ఆహుతయ్యాయి. ఇదే విధమైన కార్చిచ్చు ఆస్ట్రేలియాలో కూడా చోటు చేసుకుంది.
జంతువులు ప్రమాదం బారి నుంచి వాటంతట ఇవే కాపాడుకోవడం తప్ప ఇతరులు కాపాడే నాథడే కరువయ్యారు. ఆస్ట్రేలియాను సైతం ఈ కార్చిచ్చు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా మూడు కార్చిచ్చుల వల్ల ఒకదానికొకటి కలిసిపోయి ఆస్ట్రేలియా చరిత్రలో ఎన్నడు లేనంతగా గత సెప్టెంబర్ నుంచి కార్చిచ్చులు చెలరేగుతున్నాయి,
ఈ ఆస్ట్రేలియాలో కార్చిచ్చు వల్ల 25 మంది వరకు మరణించగా, 190 పైగా ఇళ్లు అగ్నికి దగ్ధమయ్యాయి. 480 మిలియన్లకు పైగా జంతువులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మనుషులు చేస్తున్నతప్పుల వల్ల ఆడవుల్లోని జంతువులు బలి కావల్సిన పరిస్థితి దాపురించింది. ఈ కార్చిచ్చుల వల్ల అడవులు అంతరించిపోతున్నాయి. అగ్నిలో అడవులు కూడా మసై పోవడం వల్ల మానవుల మనుగడకు కూడా నష్టం ఏర్పడే అవకాశాలున్నాయి.
ఆస్ట్రేలియాలోని అడిలైడ్ హిల్స్ లో మంటలు తారాస్థాయికి చేరాయి. ఈ అగ్నిలో అనేకమైన జంతువులు చిక్కుకుని మృత్యువాత పడ్డాయి. ఓ కంగారు మృతి చెందిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అడిలైడ్ హిల్స్ లో చోటు చేసుకున్న కార్చిచ్చులో అగ్నికిలల నుంచి తప్పించునేందుకు కంగారూ చేసిన ప్రయత్నం ప్రతి ఒక్కరిని కంటతడిపెట్టిస్తోంది. ఫెన్సింగ్ దాటుతూ అగ్నికి ఆహుతైన ఆ చిత్రం ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవింపజేసింది. ఫెన్సింగ్ వైరును పట్టుకునివ వేలాడుతూ విగతజీవిగా ఉన్న కంగారును చూస్తుంటే మేమేం పాపం చేశాం.. మాపై ప్రజలెందుకు పగ తీర్చుకుంటున్నారు అనే విధంగా ఉంది. ఇలా కంగారూలే కాదు.
మరెన్నో జంతువులు అడవిలో చెలరేగుతున్న కార్చిచ్చుకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. హెలికాప్టర్ల ద్వారా నీటిని తీసుకువచ్చి కార్చిచ్చును ఆర్పే ప్రయత్నాలు చేసినా.. మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా గ్రీన్ వ్యాలీలో ఏర్పడిన కార్చిచ్చు వల్ల ఈస్ట్ ఔర్నీ క్రీక్ కార్చిచ్చు, డున్స్ రోడ్ కార్చిచ్చులతో జతకలిసి మెగా కార్చిచ్చుగా మారినట్లు ఆస్ట్రేలియన్ అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. దేశంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన న్యూసౌత్ వేల్ప్, విక్టోరియా రాష్ట్రాల్లో ఈ కార్చిచ్చు వ్యాపించినట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వార్త సంస్థ పేర్కొంది. ఈ కార్చిచ్చు వల్ల గంటలకు 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తుండటంతో అగ్ని కీలలు వేగంగా వ్యాపిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.