పంత్‌కు మా మద్దతు ఉంది.. అందుకే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Dec 2019 7:44 PM ISTటీమిండియా యువ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ ప్రస్తుత బ్యాటింగ్ పరిస్థితిపై అటు క్రికెట్ అభిమానులతో పాటు, క్రీడా పండితులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటీవల విండీస్‌తో జరిగిన మూడు టీ20ల్లో వరుసగా 18, 33 నాటౌట్, 0 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. అంతేకాదు.. గత 15 ఇన్నింగ్స్‌ల్లో ఒక అర్దసెంచరీ.. ఎనిమిది మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోర్. దీంతో పంత్‌ను తప్పించి కేరళ క్రికెటర్ సంజూ శాంసన్‌ను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో రిషభ్ పంత్‌పై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమ్ మేనేజ్‌మెంట్.. గత కొద్ది నెలలుగా పంత్ బ్యాటింగ్, వికెట్ కీపింగ్ తీరును నిశితంగా పరిశీలిస్తోందని.. అతడిలో అపారమైన ప్రతిభ దాగుందని అన్నారు. అతడు ఏ జట్టులో ఉన్నా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడనే నమ్మకం మా అందరిలో ఉందని.. అందుకే అతడు ఫామ్‌లో లేక తంటాలు పడుతుంటే.. మేము అండగా నిలవాలని అనుకున్నామని అన్నాడు.
అంతేకాదు.. తన వైఫల్యంపై పంత్ కూడా నిరాశతోనే ఉన్నాడని.. అందుకే నెట్స్‌లో కఠోర సాధన చేస్తున్నాడని విక్రమ్ అన్నాడు. అలాగే.. ఒక్కసారి అతడు ఫామ్ అందుకుంటే టీమిండియా మ్యాచ్ విన్నర్ లేక డిసైడర్ పంత్ అవడం ఖాయమని పంత్‌ను వెనకేసుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్‌కు ఎక్కువ సమయం లేనందున ప్రయోగాలకు వెళ్లకుండా ఉండటమే బెటర్ అని.. అయితే శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబేలతో మిడిలార్డర్ బలంగా ఉందని విక్రమ్ రాథోడ్ పేర్కొన్నాడు.