ఎంతో ఉత్కంఠ రేపిన గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక పూరైంది. వైసీపీకి చెందిన అభ్యర్థి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎంపీపీ పదవికి ఒక్క నామినేషన్ మాత్రమే వచ్చిందని దీంతో ఎన్నిక ఏకగ్రీవమైందని వారు తెలిపారు. రూపవాణికి ఎంపీపీగా ఎన్నికైనట్లు ధ్రువపత్రాన్ని అందజేశారు.
ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు ఎంపీపీ కార్యాలయంలో పటిష్ట బందోబస్తు ఉత్కంఠ మధ్య ఎన్నిక కొనసాగింది. ఎంపీపీ స్థానం బీసీ మహిళకు రిజర్వు కావడంతో టీడీపీ, జనసేనలకు చెందిన గెలిచిన ఎంపీటీసీలో ఎవరూ బీసీలు లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. పరిషత్ ఎన్నికలు ముగిసిన తరువాత వివిధ కారణాలతో దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక రెండు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
18 ఎంపీటీసీ స్థానాలకు గాను 9 స్థానాల్లో టీడీపీ, 8 స్థానాల్లో వైఎస్సార్సీపీ, ఒక స్థానంలో జనసేన విజయం సాధించింది. దీంతో ఎంపీపీ పదవి ఎవరికి దక్కుతుందోననే ఉత్వంఠ కొనసాగుతూ వచ్చింది. ఎంపీపీ స్థానం బీసీ మహిళకు రిజర్వు కావడంతో వైసీపీ తరుపున సంతోషి రూపవాణితో ఎమ్మెల్యే ఆర్కే దగ్గరుండి నామినేషన్‌ను వేయించారు.