విశాఖ ఉక్కు కార్మికుల జైల్ భరో.. కేంద్రం వెనక్కి తగ్గాల్సిందే
Visakhapatnam steel plant workers hold Jail Bharo program.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర
By తోట వంశీ కుమార్ Published on 13 Feb 2022 2:34 PM ISTవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న పోరాటం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ నేపధ్యంలో ఉక్కు పరిరక్షణ పోరాట సమితి వార్షిక పోరాట కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో నేడు(ఆదివారం) జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టారు. కూర్మన్నపాలెం ఆర్చి వద్ద నుంచి గాజువాక వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తగ్గేదే లే అని కార్మికులు స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామన్నారు.
జగన్ ప్రభుత్వం ఉత్తుత్తి లేఖలతో సరిపెట్టుకోవడం చేతకానితనమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. గాజువాక చేరుకున్న అనంతరం కార్మికులు పీఎస్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఫలితంగా జాతీయ రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దీంతో కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు గాజువాక స్టేషన్‌కు తరలించారు. స్టీల్ కార్మికుల జైల్ భరోకు యువజన ప్రజా సంఘాల మద్దతు తెలిపాయి. సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి కార్మికుల నిరసనల్లో పాల్గొని సంఘీబావం ప్రకటించారు.
ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కార్మికుల పోరాటం ఆగకూడదని, ప్రధాని దిగొచ్చే వరకూ పోరాడాలని పిలుపునిచ్చారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.