విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కొండపై కొలువై ఉన్న జగన్మాత కనక దుర్గమ్మ.. 8వ రోజు అంటే నేడు నిజ అశ్వయుజ శుద్ధ అష్టమి సందర్భంగా దుర్గాదేవీగా దర్శనమి్తోంది. ఆదిశక్తి దుర్గముడనే రాక్షసుడిని సంహరించింది. అందుకే ఆదిశక్తికి దుర్గమాత అనే పేరొచ్చింది. రాక్షసుణ్ణి వధించిన తర్వాత దుర్గాదేవి స్వయంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతున్నది. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా భక్తులు దుర్గాదేవిని కొలుస్తారు. త్రిశూలం చేతపట్టుకుని, బంగారు కిరీటాన్ని ధరించి కోటిసూర్య ప్రభలతో వెలుగొందే ఈ అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తే బాధలు నశిస్తాయని భక్తుల నమ్మకం.
తన కాలి కింద మహిషాసురుణ్ణి తొక్కిపెట్టి ఉంచుతున్నట్లుగా దుర్గ మాత దర్శనమిస్తున్నారు. ఈ రోజున అమ్మవారికి అత్యంత ప్రీతి పాత్రమైన గారెలు, కదంబం(కూరగాయలు, అన్నం కలిపి వండేది), బెల్లం, పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున భక్తులు దుర్గాష్టమిగా కూడా జరుపుకుంటారు. దుర్గ అమ్మవారి దర్శనార్ధం భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. కాగా నిన్న దుర్గమాత సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొమ్మిదో రోజైన రేపు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా కనిపించనున్నారు.