విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు దుర్గమ్మ.. బాలా త్రిపుర సుందీరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మనసు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. రెండు నుండి పదేళ్ళ లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి నేడు(మంగళవారం) పూజించి కొత్త బట్టలు పెడతారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులకు అనుమతించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నవరాత్రి వేడుకల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.