బీజేపీతో టీడీపీ కలిసుంటే.. అలా జరిగేది కాదు.. సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Somuveerraju's sensational comments on TDP and YCP. తెలుగు దేశం పార్టీ.. వైసీపీ అధినేత జగన్‌ ట్రాప్‌లో పడకుండా ఉండిఉంటే

By అంజి  Published on  29 July 2022 2:31 PM IST
బీజేపీతో టీడీపీ కలిసుంటే.. అలా జరిగేది కాదు.. సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు

తెలుగు దేశం పార్టీ.. వైసీపీ అధినేత జగన్‌ ట్రాప్‌లో పడకుండా ఉండిఉంటే ఇప్పుడు బీజేపీతో కలిసి ఉండేదని, బీజేపీతో టీడీపీ కలిసి ఉంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చేది కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంచలన కామెంట్లు చేశారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల వల్లే ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి ఆగిపోయిందని ఆరోపించారు. 'మన అమరావతి బీజేపీ సంకల్ప యాత్ర' పేరుతో బీజేపీ పాదయాత్ర చేపట్టింది. ఉండవల్లిలో ఈ కార్యక్రమాన్ని సోమువీర్రాజు ప్రారంభించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులు, చేస్తున్న పనులపై ప్రచారం బీజేపీ ప్రచారం చేపట్టింది.

అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో వారం రోజుల పాటు ఈ సంకల్ప పాదయాత్ర కొనసాగనుంది. బీజేపీ చేపట్టిన యాత్రలో బీజేపీ నాయకులు, అమరావతి ప్రాంత రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆగస్టు 4వ తేదీన సాయంత్రం తుళ్ళూరులో యాత్రను ముగించనున్నారు. అక్కడే భారీ బహిరంగ సభ జరగనుంది. బీజేపీ సంకల్ప యాత్రలో టీడీపీ, వైసీపీపై సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 2014లో రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్‌లో అనేక పరిణామాలు జరిగాయని, ఆ సమయంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రాజధాని కోసం రైతుల నుంచి భూమి సేకరించి, రాజధాని నిర్మించకుండా వదిలేసిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతి కోసం ఓ సారి రూ.4వేల‌కోట్లు, మరోసారి రూ. 2500కోట్లు ఆనాడు మంజూరు చేసిందని గుర్తు చేశారు. అమరావతి స్మార్ట్‌ సిటీ కోసం ఈ డబ్బుల వినియోగించలేదని సోమువీర్రాజు ఆరోపించారు. మాట తప్పను మడమ తిప్పను అంటూ రాజధానిపై చాలా ప్రసంగాలు చేసిన సీఎం జగన్‌.. ఇప్పుడు మోసం చేశారని విమర్శించారు. అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నానని, అమరావతిని అభివృద్ధి చేస్తానని నమ్మించి గొంతుకోశారన్నారు. గెలిచిన తర్వాత మాట మార్చి మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని సోము అన్నారు. జగన్ ప్రభుత్వం వెంటనే అమరావతిలో నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

కేంద్రం కన్నా ఏపీ ఆర్థిక పరిస్థితి బాగుందని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పడంపై కూడా సోమువీర్రాజు అనుమానం వ్యక్తం చేశారు. అంతలా డబ్బులు ఉంటే రాష్ట్రంలో రోడ్లు ఎందుకు వేయట్లేదని ప్రశ్నించారు. ''ప్రజలకు బియ్యం ఎందుకు ఇవ్వలేకపోయారు. చేసిన పనుల బిల్లుల కోసం కాంట్రాక్టర్‌లు బిల్లుల ఎందుకు పోరాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డబ్బులు ఉంటే రాజధాని ఎందుకు కట్టలేదు.'' అని సోమువీర్రాజు ప్రశ్నించారు. అమరావతిని రాజధానిగా ముందుకు తీసుకెళ్లడం బీజేపీ లక్ష్యమని సోమువీర్రాజు అన్నారు.

Next Story