హోదాతో సంబంధం లేకుండా పని చేస్తా : సోమేశ్‌కుమార్
Somesh Kumar Reached Vijayawada.తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ విజయవాడ
By తోట వంశీ కుమార్
తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ గురువారం విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలో చీఫ్ సెక్రటరీని కలిసి జాయినింగ్ రిపోర్టర్ ఇవ్వనున్నట్లు చెప్పారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవనున్నట్లు వెల్లడించారు. ఏపీలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా పని చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఏ బాధత్య ఇచ్చినా నిర్వర్తిస్తాను. ఒక అధికారిగా డీవోపీటీ ఆదేశాలు పాటిస్తున్నాను. హోదాతో సంబంధం లేకుండా పని చేస్తాను అని అన్నారు. మీడియాతో మాట్లాడిన అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన విజయవాడకు బయలుదేరారు.
సోమేశ్‌కుమార్‌కు హైకోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌కుమార్‌ను ఏపీ కి కేటాయించడంతో అక్కడే విధులు నిర్వర్తించాలని పేర్కొంటూ తెలంగాణలో కొనసాగింపును న్యాయస్థానం రద్దు చేసింది. హైకోర్టు తీర్పు రావడమే ఆలస్యం కేంద్రం కూడా సోమేశ్ కుమార్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఏపీకి వెళ్లాలని ఆదేశించింది.
సోమేశ్‌కుమార్ పదవికాలం ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉంది. దీంతో ఆయన మిగిలిన పదవీకాలాన్ని ఏపీలో పూర్తి చేయాల్సి ఉంది. ఇక ఏపీలో ఆయనకు ఏ పోస్టింగ్ ఇస్తారు అన్న ఆసక్తి నెలకొంది.