తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు విజయ్ అనే భక్తుడు సోమవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గ ఆలయానికి అగ్గిపెట్టెలో సరిపోయే పట్టుచీరను సమర్పించారు. బంగారం, వెండితో చేసిన ఈ చీరకు ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ఈ చీరను చక్కటి పట్టు దారాలతో నేసేందుకు ఐదు గ్రాముల బంగారం, పది గ్రాముల వెండి వినియోగించామన్నారు. ఈ చీర 100 గ్రాముల బరువు ఉంటుందని, చేనేత వృత్తిని కాపాడాలని అమ్మవారిని వేడుకున్నట్లు వివరించారు. సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ అనేక సందర్భాల్లో తన ప్రతిభను కనబరిచిన చేనేత కళాకారుడు. విజయ్ గతంలో సువాసనలు వెదజల్లే వెండి చీరను తయారు చేసిన ఘనత కూడా పొందాడు. రెండు రోజుల క్రితమే విజయ్ తిరుమలకు కూడా చీరను అందించినట్లు సమాచారం.