చ‌లో విజ‌య‌వాడ‌.. ఉద్యోగుల నిర్భంధాలు, ఫాల్కన్ వాహనంతో పరిస్థితుల పరిశీలన

Police Restrictions on Chalo Vijayawada.కొత్త పీఆర్‌సీ జీవోల‌కు వ్య‌తిరేకంగా ఉద్యోగ సంఘాలు నేడు(గురువారం) చ‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Feb 2022 9:36 AM IST
చ‌లో విజ‌య‌వాడ‌.. ఉద్యోగుల నిర్భంధాలు, ఫాల్కన్ వాహనంతో పరిస్థితుల పరిశీలన

కొత్త పీఆర్‌సీ జీవోల‌కు వ్య‌తిరేకంగా ఉద్యోగ సంఘాలు నేడు(గురువారం) చ‌లో విజ‌య‌వాడ‌కు పిలుపునిచ్చారు. అయితే.. చ‌లో విజ‌య‌వాడ‌కు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. కరోనా కేసుల ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకొని 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా.. ఎవ్వ‌రూ రావొద్ద‌ని, క‌రోనా నిబంధ‌న‌లు ఉల్ల‌గించ‌వ‌ద్దన్నారు. అలాకాదు అని ఎవ‌రైనా నిర‌స‌న తెల‌పాల‌ని చూస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు ప్ర‌క‌టించారు. అయితే.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చ‌లో విజ‌య‌వాడ‌ను నిర్వ‌హించి తీరుతామ‌ని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో విజ‌య‌వాడ‌లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం కొన‌సాగుతోంది. బీఆర్టీఎస్ రోడ్డు మీద పోలీసులు భారీగా మోహరించారు. ఫాల్కన్ వాహనంతో చుట్టుపక్కల పరిస్ధితులను అనుక్షణం పరిశీలిస్తున్నారు. బీఆర్టీఎస్ రోడ్డు చుట్టుపక్కల అన్నివైపులా పికెట్లు ఏర్పాటు చేశారు. మరో నాలుగు పాయింట్ల వద్ద భద్రత అదనంగా ఏర్పాటు చేశారు. ఇక జిల్లాల నుంచి విజ‌య‌వాడ బ‌య‌ల్దేరిన ఉద్యోగుల‌ను పోలీసులు ఎక్కడిక్క‌డ అడ్డుకుంటున్నారు. ప‌లు చోట్ల ఉద్యోగ సంఘాల నేత‌ల‌ను గృహ‌నిర్భంధం చేస్తున్నారు.

ప‌లు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఉద్యోగులు వ‌చ్చే వాహ‌నాల‌ను వెన‌క్కు పంపుతున్నారు. క‌డ‌ప‌, ప్ర‌కాశం జిల్లాల‌ నుంచి ప్రైవేటు వాహ‌నాల్లో బ‌య‌లుదేరిన ఉద్యోగుల‌ను అక్క‌డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్యోగులు.. పోలీసులు, ప్ర‌భుత్వ వైఖ‌రికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

స‌మ్మెకు ఆర్టీసీ దూరం..

ఇదిలా ఉంటే.. ఉద్యోగుల సమ్మెకు ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు దూరంగా ఉంటున్నట్లు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవి, కొవూరు ఎజ్రాశాస్త్రిలు తెలిపారు. తమ సంఘం నిర్ణయాన్ని బుధవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి లిఖితపూర్వకంగా అంద‌జేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయంతోపాటు కరోనా కష్ట కాలంలో 55 వేల కుటుంబాలకు ప్రతి నెల జీతాలిచ్చి ఆదుకున్న సీఎం జ‌గ‌న్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయడం అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లేనన్నారు. ఉద్యోగులు ఎవరూ సమ్మెలో పాల్గొనరాదని సంఘం సమావేశంలో తీర్మానించినట్లు చెప్పారు.

Next Story