ఉద్యోగ సంఘాలకు షాక్.. చలో విజయవాడకు అనుమతి లేదు
No permission for PRC Sadhana Samithi's Chalo Vijayawada.ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు ఉద్యోగ సంఘాలు ఎవ్వరూ
By తోట వంశీ కుమార్ Published on 2 Feb 2022 12:49 PM ISTఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు ఉద్యోగ సంఘాలు ఎవ్వరూ కూడా పీఆర్‌సీ అంశంపై వెనక్కి తగ్గడం లేదు. మొన్నటి వరకు చర్చలతోనే సమసిపోతుందనుకున్న సమస్య ఇప్పుడు మరింత జటిలంగా తయారైంది. కొత్త పీఆర్‌సీ అమలు చేయొద్దంటూ ఉద్యోగులు ఉద్యమం చేస్తుంటే.. కొత్త పీఆర్‌సీ ప్రకారం ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలను జమ చేసింది ప్రభుత్వం. దీంతో ఉద్యోగ సంఘాలు 'చలో విజయవాడ'కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.
రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి పై తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ఉద్యోగ సంఘాలు నిర్వహించ తలపెట్టిన 'చలో విజయవాడ' కార్యక్రమానికి ఎటువంటి పోలీసు అనుమతి లేదు. కరోనా కేసుల ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకొని 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా.. మీ వ్యక్తిగత ఆరోగ్యం, మరియు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అధిక సంఖ్యలో ప్రజలు గుమిగూడే నేపథ్యంలో 'చలో విజయవాడ' కార్యక్రమానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. అలా కాకుండా పోలీసు వారి ఆదేశాలను మీరి ఎవరైనా అధిక సంఖ్యలో ప్రజలు ఒకచోట కూడి విజయవాడ వెళ్లి నిరసన తెలపాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు.
విజయవాడ సిటీ పోలీస్ - పి. ఆర్. సి సాధన కమిటీ వారు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ఎటువంటి అనుమతి లేదు. #Omicron #COVID19 #Vijayawada #covidrestrictions #socialdistancing #vijayawadacity #policepersonnel #AndhraPradesh #AndhraPradeshStatePolice @APPOLICE100 @dgpapofficial pic.twitter.com/ptQv6QzTOw
— Vijayawada City Police (@VjaCityPolice) February 1, 2022
ఇదిలా ఉంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ 'చలో విజయవాడ' కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.