రైతుకు ఏమాత్రం నష్టం వచ్చినా మేము ఉన్నాం.. రాజకీయాలు చేయడం విడ్డూరం : మంత్రి

Minister Merugu Nagarjuna Fire On TDP. అకాల వర్షాల వల్ల పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విదాలుగా ఆదుకుంటున్నదని

By Medi Samrat  Published on  8 May 2023 9:15 PM IST
రైతుకు ఏమాత్రం నష్టం వచ్చినా మేము ఉన్నాం.. రాజకీయాలు చేయడం విడ్డూరం : మంత్రి

అకాల వర్షాల వల్ల పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విదాలుగా ఆదుకుంటున్నదని, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షానికి చెందిన నాయకులు రాజకీయాలు చేయడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న జగన్‌ ప్రభుత్వం పై ఇటువంటి ఆరోపణలు చేయడం మానుకోవాలని ప్రతిపక్ష నాయకులకు ఆయన హితవు పలికారు.

సోమవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ.. ఈ మద్యకాలంలో కురిసిన అకాల వర్షాల వల్ల రాష్ట్రంలోని రైతులు ఎవరూ నష్టపోకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంలో వెంటనే స్పందించి అన్ని జిల్లాల కలెక్టర్లను, అధికారులను అప్రమత్తం చేయడమే కాకుండా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలను తీసుకోవడం జరిగిందన్నారు. రైతుకు ఏమాత్రం నష్టం వచ్చినా మేము ఉన్నాము అనే భరోసా కల్పించే విధంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతుందనే విషయాన్ని ప్రతి పక్ష పార్టీ నాయుకులు మరిచిపోకూడదన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు ఏమాత్రం నష్టపోయినా ఏళ్లతరబడి సహాయం అందేది కాదని, అయితే అటు వంటి పరిస్థితి ప్రస్తుతం పాలనలో లేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండాలనే లక్ష్యంతో వారి గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలను పెట్టి వ్యవసాయ రంగంలో నూతన విధానాలకు, సంస్కరణలకు జగనన్న ప్రభుత్వం నాంది పలికిందన్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగుచున్నదన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ క్రింద 2014-19 మధ్య కాలంలో గత ప్రభుత్వం రూ.33,625 కోట్లు ఖర్చు చేస్తే, జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత ఏడాది డిశంబరు మాసాంతాని కల్లా ఎస్సీలకు రూ.49,710 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఈ నిధుల వెచ్చింపులో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఎంతో పారదర్శకంగా ఖర్చు చేయడం జరిగిందని, అయితే గత ప్రభుత్వ పాలనలో ఎస్సీ కార్పొరేషన్లో ఎంతో అవినీతి జరిగిందని విమర్శించారు.


Next Story